Share News

ఇకపై ఈ-ఫైలింగ్‌లోనే..

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:58 PM

Accused persons' bail applications via e-filing న్యాయవ్యవస్థలో సరికొత్త ప్రక్రియ ద్వారా న్యాయం అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్‌ కేసుల్లో ఉన్న ముద్దాయిలకు బెయిల్‌ కోసం చేసే దరఖాస్తులను ఇకపై ఈ-ఫైలింగ్‌ ద్వారానే న్యాయవాదులు దాఖలు చేయనున్నారు.

ఇకపై ఈ-ఫైలింగ్‌లోనే..
జిల్లాకోర్టులోని హెల్ప్‌డెస్క్‌లో పేర్లు నమోదు

  • ముద్దాయిల బెయిల్‌ దరఖాస్తులు

  • కోర్టు వెబ్‌సైట్‌లో న్యాయవాదుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

  • రేపటి నుంచి కొత్త ప్రక్రియ అమలు

  • శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థలో సరికొత్త ప్రక్రియ ద్వారా న్యాయం అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్‌ కేసుల్లో ఉన్న ముద్దాయిలకు బెయిల్‌ కోసం చేసే దరఖాస్తులను ఇకపై ఈ-ఫైలింగ్‌ ద్వారానే న్యాయవాదులు దాఖలు చేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఈ ప్రక్రియ అమలుకానుంది. బెయిల్‌ దరఖాస్తులు ఈ-ఫైలింగ్‌ చేసే న్యాయవాదులు తమ పేర్లు ముందుగానే కోర్టు వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని హై కోర్టు సూచించింది. బార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్టిఫికెట్‌, బార్‌ ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు, ఈ-మెయిల్‌ చిరునామా, ఫోన్‌ నెంబర్‌ వివరాలతోపాటు ఫొటో జత చేసి నమోదు చేయాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లాకు చెందిన న్యాయవాదులు తమ పేర్లను కోర్టు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటున్నారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ ద్వారా ఇప్పటివరకు సుమారు 200 మంది, ఇతర ప్రాంతాల్లో మరో 150 మంది న్యాయవాదులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయినవారు.. ఈ నెల 15 నుంచి ముద్దాయిల బెయిల్‌ దరఖాస్తులను నేరుగా కోర్టు వెబ్‌సైట్‌లోనే ఈ-ఫైలింగ్‌ చేసుకోవచ్చు. ఇకపై ముద్దాయిల బెయిల్‌ దరఖాస్తులను కోర్టు నేరుగా స్వీకరించదు.

  • మంచి పరిణామం

  • ఈ-ఫైలింగ్‌ విధానం న్యాయవ్యవస్థకు మంచి పరిణామం. దీనివల్ల నిజమైన న్యాయవాదులకు లాభం కలుగుతుంది. నేరుగా దరఖాస్తు విధానం ఉన్నప్పుడు వకాల్తా మీద ప్రాక్టీస్‌ చేయనివారు కూడా సంతకాలు చేసి న్యాయవాదిగా చలామణి అయ్యేవారు. ఈ- ఫైలింగ్‌లో ఈ అవకాశానికి తావు లేదు. దీనివల్ల పారదర్శకత, న్యాయవాదుల జవాబుదారీతనం పెరుగుతుంది. ఎవరు బెయిల్‌ దరఖాస్తు చేస్తే వారే కేసుకు హాజరు కానుండడంతో గందరగోళానికి తావుండదు.

    - ఆగూరు ఉమామహేశ్వరరావు, జిల్లా బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు

  • సౌకర్యాలు కల్పించాలి

  • న్యాయవ్యవస్థలో మార్పులు ఆహ్వానించదగినవే. కానీ అందుకు తగిన సౌకర్యాలు కూడా కల్పించాలి. కొత్త విధానంలో సీనియర్‌ న్యాయవాదులు నమోదు కావాలంటే అందుకు వారి పత్రాలు సమకూర్చుకోవడం కొంత ఇబ్బంది. దీనిని అధిగమించాలంటే సుప్రీం కోర్టు, హై కోర్టుల్లో మాదిరి జిల్లా కోర్టుల్లో సీనియర్‌ అడ్వకేట్స్‌కు ప్రాధాన్యత గుర్తింపు ఇస్తే బాగుంటుంది.

    - బి.మురళీకృష్ణ, సీనియర్‌ న్యాయవాది, శ్రీకాకుళం బార్‌ సభ్యుడు

Updated Date - Jun 13 , 2026 | 11:58 PM