Share News

20 కోట్ల నుంచి 8 కోట్లకు

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:15 AM

Coconut yield drops sharply in Uddanam ఉద్దానం.. కొబ్బరి పంటకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఎటుచూసినా ఈ ప్రాంతం కొబ్బరిచెట్లతో కళకళలాడేది. ఇక్కడ కొబ్బరిచెట్ల నుంచి ఎన్నో విలువైన ఉత్పత్తులు తయారయ్యేవి. తద్వారా రైతులు, కార్మికుల నుంచి వ్యాపారులు, చిన్న పరిశ్రమల యాజమానుల వరకూ లక్షలాది మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి దక్కేది. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నం. వరుస తుఫాన్లు, తెగుళ్లతో కొబ్బరి పంట నాశనమై.. రైతుల బతుకులు తలకిందులయ్యాయి.

20 కోట్ల నుంచి 8 కోట్లకు

  • ఉద్దానంలో భారీగా తగ్గిన కొబ్బరి దిగుబడి

  • తెగుళ్లు, తుఫాన్లతో రైతులకు తీరని నష్టం

  • రియల్‌ వెంచర్లుగా మారుతున్న తోటలు

  • కొబ్బరితో ఎన్నెన్నో ప్రయోజనాలు

  • ప్రోత్సాహకాలు ఇవ్వాలంటున్న రైతులు

  • నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం

  • కవిటి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉద్దానం.. కొబ్బరి పంటకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఎటుచూసినా ఈ ప్రాంతం కొబ్బరిచెట్లతో కళకళలాడేది. ఇక్కడ కొబ్బరిచెట్ల నుంచి ఎన్నో విలువైన ఉత్పత్తులు తయారయ్యేవి. తద్వారా రైతులు, కార్మికుల నుంచి వ్యాపారులు, చిన్న పరిశ్రమల యాజమానుల వరకూ లక్షలాది మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి దక్కేది. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నం. వరుస తుఫాన్లు, తెగుళ్లతో కొబ్బరి పంట నాశనమై.. రైతుల బతుకులు తలకిందులయ్యాయి. ఆశించినస్థాయిలో దిగుబడి లేక.. అప్పులపాలై.. కొబ్బరితోటలను అమ్ముకునే దుస్థితి నెలకొంది. బుధవారం ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఉద్దానంలో పరిస్థితిని పరిశీలిద్దాం.

  • ఉద్దానం ప్రాంతం కనుచూపుమేర కొబ్బరి తోటలతో కోనసీమను తలపించేది. కొబ్బరి పంట రైతులకు సిరులు కురిపించేది. కానీ.. తెగుళ్లు, తుఫాన్ల తాకిడితో నేడు ఉద్దానంలో కొబ్బరి కళ తప్పింది. ప్రకృతి కన్నెర్రతో దిగుబడి లేక రైతులను ఆదుకోలేకపోతోంది. జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పలాస తదితర మండలాల పరిధిలో 52వేల ఎకరాల్లో కొబ్బరి సాగువుతోంది. ఉద్దానంలో ఏటా 20 కోట్ల కాయలు దిగుబడి వచ్చేవి. ప్రస్తుతం 8 కోట్లకు దిగుబడి పడిపోయింది. 1999లో పెనుతుఫాన్‌ అనంతరం ఉద్దానం రూపురేఖలు మారిపోయాయి. ఆ తర్వాత పైలిన్‌, నీలం, హుద్‌హుద్‌తోపాటు 2018లో వచ్చిన తితలీ తుఫాన్‌ ప్రభావంతో వేలాది కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. ఇప్పటికీ రైతులు కోలుకోలేని స్థితి నెలకొంది. తుఫాన్ల అనంతరం ఎర్రనల్లి, తెల్లదోమ తెగుళ్లు సోకి దిగుబడి తగ్గుతోంది. కొబ్బరి మొక్క నాటిన 8 ఏళ్ల తర్వాత కాపునకు వస్తాయి. 60 ఏళ్ల వరకూ దిగుబడి ఇస్తాయి. కాగా.. మొక్క పెరుగుతున్న దశలో కొమ్ముపురుగు, కాండం తొలుచు పురుగు లు ఆశించి చెట్లను నాశనం చేస్తున్నాయి. కంచిలి మండలంలో కొన్నిచోట్ల నల్లముట్టి తెగులు ప్రభావంతో చెట్లు ఎండిపోతున్నాయి. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కొబ్బరి పంట స్థితిగతులు మారిపోయాయి. ఆశించినస్థాయిలో దిగుబడులు లేక వచ్చిన కాయలు పరిమాణం చిన్నవిగా ఉండడంతో వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి దుస్థితి నెలకొంది. కొబ్బరి వ్యాపార కేంద్ర మైన కంచిలిలో వ్యాపారం వెలవెలబోతోంది. ఒడిశా వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలాగే కొబ్బరిచెట్ల నుంచి కాయలు దించటం, వాటిని విక్రయించే సమయంలో తొక్కలు తీసే కార్మికులు తగ్గిపోతున్నారు. యువకులు ఉపాధివేటలో వలస పోతున్నారే తప్ప.. కార్మికులుగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.

  • కొబ్బరితో ఉపయోగాలెన్నో

  • కొబ్బరి చెట్టులో ప్రతీది ఉపయోగకరమైనవే. కొబ్బరిపీచుతో కార్పెట్లు, పరుపులు, తాళ్లు తయారుచేస్తారు. వంటచెరకుగా ఇంటి నిర్మాణ సామగ్రి తయారీలోను వినియోగిస్తారు. కేరళలో కొబ్బరి కల్లు(నీరా) ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నారు. ‘కొబ్బరినీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కొబ్బరికాయలో 48శాతం లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కొబ్బరినూనెలో ఉండే పాటియాసిడ్స్‌తో వైరల్‌, బ్యాక్టీరియా వంటివి తగ్గించటంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ శాతం తక్కువగా ఉండటం వలన కొబ్బరినూనెతో వంటకాలు చేయటం మంచిద’ని వైద్యులు సూచిస్తున్నారు.

  • ప్లాట్లుగా మారుతున్న తోటలు

  • తుఫాన్లు, తెగుళ్ల తాకిడితో కొబ్బరిచెట్లు దెబ్బతినడంతో రైతుల బతుకులు దయనీయంగా మారాయి. కొబ్బరి ధరలు నిలకడగా లేకపోవడంతో అరకొర ఆదాయంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టమవుతోంది. ఈక్రమంలో చాలామంది అప్పులపాలై.. కొబ్బరితోటలను విక్రయిస్తున్నారు. వాటిని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో ఎకరా రూ.50 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ పలుకుతోంది.

  • రైతుల పరిస్థితి దారుణం

  • ఉద్దానంలో కొబ్బరిరైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మొక్కల సంరక్షణ, పంటపై ఆధారపడి కుటుంబాన్ని గడపటం కష్టంగా మారింది. కాయల ధర నిలకడగా లేకపోవటం మరింతగా కుంగదీస్తోంది. కూలీల కొరత వేధిస్తోంది. కొబ్బరి రైతులకు ఉపాధి పథకం ద్వారా సహకారం అందిస్తే కొంతమేర అనుకూలంగా ఉంటుంది.

    - ఎ.మధు, రైతు, కవిటి

  • సంరక్షణ భారమే

  • ఉద్దానంలో కొబ్బరిచెట్ల సంరక్షణ భారంగా మారింది. తుఫాన్‌లు, తెగుళ్ల తాకిడితో దిగుబడి తగ్గుతోంది. కాయలకు సరైన మార్కెట్‌ లేకపోవటంతో ధరల్లో తీవ్ర వ్యత్యాసం ఉండి రైతుకు కన్నీరు మిగులుతోంది.

    - బి.చక్రధర్‌, రైతు, కవిటి

Updated Date - Sep 02 , 2026 | 12:15 AM