జైలులో స్నేహం, వ్యూహం.. బయటకొచ్చి నేరం
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:08 AM
Gang-related thefts వివిధ నేరాలపై జైల్లో ఉన్నవారు స్నేహితులుగా మారుతున్నారు. ముఠాలుగా ఏర్పడి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ముఠాలుగా ఏర్పడి దొంగతనాలు
వ్యసనాలకు బానిసలవుతున్న వైనం
పోలీసుల విచారణలో ఎన్నో విచిత్రాలు
శ్రీకాకుళం క్రైం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వివిధ నేరాలపై జైల్లో ఉన్నవారు స్నేహితులుగా మారుతున్నారు. ముఠాలుగా ఏర్పడి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ చోరీ కేసులో ఐదుగురు నిందితులను శ్రీకాకుళం నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఎప్పుడూ కలిసే దొంగతనాలు చేస్తారు. కలిసే జైలుకు వెళతారు. అలా అని వారంతా చిన్ననాటి స్నేహితులు కాదు. బాల్యంలో చోరీలు చేసి వేర్వేరుగా జైలుకు వెళ్లి వచ్చినవారు. వీరంతా ఇళ్లకు వేసిన తాళాలను పగులకొట్టడం, పార్కింగ్‌లో ఉన్న బైక్‌లను దొంగిలించడంలో ఆరితేరిపోయారు. ఇలా జైలు నుంచి విడుదలైన తర్వాత చాలామంది ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వివిధ నేరాల్లో అరెస్టు చేసిన నిందితులను విచారించినప్పుడు తమ మధ్య స్నేహం జైల్లోనే ఏర్పడిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమాధానం దొంగతనాలకు పాల్పడిన నిందితుల నుంచి వినిపిస్తోంది.
దొంగతనాలు, గంజాయి కేసుల్లో చిక్కి జైళ్లకు వెళ్లడానికి అలవాటు పడినవారు బయటకు వచ్చాక ముఠాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. జైల్లో కొత్తగా పరిచయమైన నేరగాళ్లను తమకు సహాయకులుగా నియమించుకుంటున్నారు. ఒక నేరంలో అరెస్టయిన నిందితులను జైల్లో ఒకే బ్యారక్‌లో పెట్టరు. వారిని వేర్వేరు బ్యారక్‌లకు పంపుతారు. కేంద్ర కారాగారాల్లో మాత్రమే బ్యారక్‌ల సదుపాయం ఎక్కువగా ఉంటుంది. జిల్లా జైళ్లు, సబ్‌జైళ్లలో బ్యారక్‌ల సదుపాయం తక్కువ. ఉన్న బ్యారక్‌ల్లోనే నేరగాళ్లను ఉంచుతారు. ఎక్కువగా జిల్లా, సబ్‌జైళ్లకు వెళ్లిన నేరగాళ్ల మధ్య కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. జైల్లో ఉన్నన్ని రోజుల్లో బాగా దగ్గరవుతారనని పేర్కొన్నారు. పదేపదే జైలుకు వచ్చిన నేరగాడికి కొత్తగా నేరం చేసి వచ్చినవారితో పరిచయం ఏర్పడగానే బయటకు వచ్చాక వారంతా గ్యాంగ్‌గా ఏర్పడుతున్నారు.
వివాదాలకు నిలయంగా...
క్షణికావేశంలోనో, తెలిసీ తెలియక తప్పులు చేసి జైలు పాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన అధికారుల్లో కొందరు వారికి చిత్రహింసలు పెడుతూ జీవితంపైనే విరక్తి కలిగేలా చేస్తున్నారు. జైళ్లలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు గ్రూపు తగాదాలు, భారీగా సిబ్బంది కొరతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖైదీల పరివర్తనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఘటనలెన్నో..
కొన్నాళ్ల కిందట శ్రీకాకుళం మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన ఎర్రబిల్లి అశోక్, గార మండలం బలరాంపురానికి చెందిన చోడిపల్లి వంశీ, పాలకొండ మండలం తోటవాడకు చెందిన బెండి శివప్రసాద్ ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో పట్టుబడ్డారు. 45 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. కొన్నాళ్ల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. రాత్రివేళల్లో ఆలయాల్లో కూడా చోరీలకు పాల్పడారు. ఇటీవల 8 ఆలయాల్లో చోరీలకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కారు.
గత నెల 22న ఎచ్చెర్లలో పొలానికి వెళ్తున్న ఓ మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును ఇద్దరు వ్యక్తులు తెంచి పట్టుకుపోయారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రావుల వినోద్ పోలీసులకు పట్టుబడ్డాడు. గోదావరి జిల్లాలకు చెందిన శ్రీరామ్, పోతురాజు, గణేష్ మౌలాలీలతో కలిసి వినోద్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరందరూ జైల్లో కలుసుకున్న క్రమంలోనే బృందాలుగా ఏర్పడి దొంగతనాలకు ప్లాన్ చేసుకున్నట్టు గుర్తించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఉండువ నాగరాజు, విశాఖకు చెందిన చేపల ఆనంద్, అనకాపల్లికి చెందిన మాటూరు శ్రీనివాస్, కోనసీమ జిల్లా చింతలపూడికి చెందిన మద్దిల చంటిబాబు, బిహార్‌కు చెందిన శుభంమిశ్రాను గత నెలలో శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతుంటారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరు జైల్లో కలిసినప్పుడు స్నేహం కుదరడంతో ముఠాగా ఏర్పడ్డారు. వీరి నుంచి రూ.30లక్షల వరకు సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గట్టి నిఘా ఏర్పాటు
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడే నేరస్థులపై గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. లాక్ట్‌హౌస్ మోనటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను వినియోగించుకోవాలి. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా భద్రపర్చుకోవాలి.
- వివేకానంద, టౌన్ డీఎస్పీ, శ్రీకాకుళం