Share News

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:30 AM

Free medical treatment రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఎం రాహత్‌’ పథకం ద్వారా అత్యవసర వైద్య సేవలు ఉచిత ంగా అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఎం రాహత్‌’ పథకం ద్వారా అత్యవసర వైద్య సేవలు ఉచిత ంగా అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన ఈ పథకం అమలు తీరుపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన మొదటి గంట వ్యవధిలోనే బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంతో అనుసంధానమై జిల్లాలో పీఎం రాహత్‌ పథకం పక్కాగా అమలు జరుగుతోంది. పోలీసు శాఖలో ప్రమాదాల వివరాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసేందుకు ఈడీఏఆర్‌ విధానాన్ని ప్రాధాన్యతతో అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు ఉచిత నగదురహిత చికిత్సను పొందవచ్చు. కేవలం ప్రాథమిక గుర్తింపుతోనే వైద్య సహాయం అందుతుంది. ఆయుష్మాన్‌ భారత్‌ అనుసంఽధాన అసుపత్రుల ద్వారా వైద్యం పొందే వీలుంది. బాధితులను కాపాడేందుకు ముందుకు వచ్చే ప్రత్యక్ష సాక్షులను, సహాయకులకు పోలీసు వేధింపులు, చట్టపరమైన చిక్కులు రాకుండా రక్షణ కల్పించే గుడ్‌ సమరిటన్‌ చట్టాన్ని దీనికి వర్తింపు చేస్తాం. అత్యవసర సమయం కోసం ఉద్దేశించిన 100, 101, 102, 1033, 1091 నెంబర్లను 112 హెల్ప్‌లైన్‌తో అనుసంధానించే ప్రక్రియ సాగుతోంద’ని తెలిపారు. రోడ్డు భద్రత, ప్రథమ చికిత్సపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 108 వాహన సిబ్బంది ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా శ్రీకాకుళంలోని రిమ్స్‌, టెక్కలి జిల్లా ఆసుపత్రులలో రెండు ట్రామాకేర్‌ సెంటర్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్టీవో గంగాధర్‌, డీఎస్పీలు, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:30 AM