షేర్‌మార్కెట్ పేరిట మోసం
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:32 PM
Rs. 1.03 crore fraud షేర్‌మార్కెట్ పేరిట ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మోసగించి రూ.1.03 కోట్లకుపైగా కాజేసిన ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
రూ.1.03 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): షేర్‌మార్కెట్ పేరిట ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మోసగించి రూ.1.03 కోట్లకుపైగా కాజేసిన ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి టూటౌన్ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరం కర్రావీధికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎస్.శ్రీనివాసరావుకు షేర్‌మార్కెట్‌పై అనుభవం ఉంది. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ.. ‘వర్క్‌ఫ్రం హోం’లో భాగంగా శ్రీకాకుళంలో ఇంటివద్దనే ఉంటున్నారు. ఆయన నిత్యం షేర్‌మార్కెట్ పరిస్థితిని గమనిస్తూ.. క్యాప్స్‌టాయిన్ పేరిట వచ్చిన ఒక ప్రకటన లింక్‌కు ఆకర్షితుడై ఓపెన్ చేశారు. అది క్యూఐబీ యాప్‌కు మళ్లించడంతో దానిని నమ్మి అధిక వడ్డీకి ఆశపడి దఫదఫాలుగా రూ.1,03,55,000 పెట్టుబడి పెట్టారు. చెప్పిన లాభాలు విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా మరికొంత డబ్బు చెల్లించాలని క్యూఐబీలో కంపెనీదారులు తెలిపారు. దీంతో తాను మోసపోయానని గుర్తించి గత నెల 18న శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసి.. ఈ ఆర్థిక మోసం వ్యవహారం వెనుక విజయవాడ కృష్ణలంకకు చెందిన దేవిరెడ్డి ప్రేమ్‌కుమార్, కేశినేని కిషన్‌చౌదరి, షేక్‌తోఫి అహ్మద్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ ఈశ్వరరావు తెలిపారు.