సిక్కోలులో మరో నాలుగు!
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:13 AM
చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఉవ్వీళ్లూరుతున్న రాజకీయ ఆశావహులకు కేంద్రం శుభవార్త వినిపించింది.
జిల్లాలో 12కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు!
ప్రస్తుత సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు
2011 జనాభా లెక్కల ఆధారంగానే ప్రక్రియ
శ్రీకాకుళం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఉవ్వీళ్లూరుతున్న రాజకీయ ఆశావహులకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. జనాభా ప్రాతిపదికన కాకుండా, అన్ని రాష్ట్రాల్లో ఒకే శాతంతో (యాభై శాతం పెంపు) సీట్లను పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే.. జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల సంఖ్య 12కు పెరిగే అవకాశం ఉంది.
జిల్లాకు అదనంగా నాలుగు స్థానాలు
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా భౌగోళిక ముఖచిత్రం పరిధిలో శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల.. మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా యాభై శాతం పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రకారం జిల్లాలోని మరో నాలుగు స్థానాలు వచ్చి చేరతాయి. అప్పుడు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 12కు చేరుకుంటుంది. దీంతో ఏఏ మండలాలను కలిపి కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు? పాత నియోజకవర్గాల స్వరూపం ఎలా మారబోతోంది? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో అప్పుడే ఉత్కంఠ మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. టెక్కలి, మెళియాపుట్టి, నందిగాం మండలాలు కలిపి ఒక నియోజకవర్గంగాను, అలాగే సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు కలిపి కోటబొమ్మాళి నియోజకవర్గంగా, అలాగే మందస, సోంపేట మండలాలు.. సోంపేట నియోజకవర్గంగా, ఇటు రణస్థలం, లావేరు మండలాలు.. కలిపి రణస్థలం నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే పాతపట్నంలో కలిసి ఉన్న ఎల్‌ఎన్ పేట మండలం ఇటు ఆమదాలవలసలో.. నరసన్నపేటలో ఉన్న పోలాకి మండలాన్ని.. అటు కోటబొమ్మాళిలో కలపడం వంటివి జరిగి.. కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఈ కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లులపై మంగళవారం సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రభుత్వం చర్చించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే టీడీపీ, వైసీపీ, బిజూ జనతాదళ్, శివసేన తదితర పార్టీలతో చర్చలు జరిపారు. ఈ బిల్లుల ఆమోదం కోసం అవసరమైతే శని, ఆదివారాల్లో కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని, బడ్జెట్ సెషన్‌ను ఏప్రిల్ 2 నుంచి మరో వారం పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది.