Share News

గుర్తించారు.. వదిలేశారు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:54 PM

జిల్లా తీర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పదేళ్ల కిందట 61 బీచ్‌లను అధికారులు గుర్తించారు.

గుర్తించారు.. వదిలేశారు
రట్టి బీచ్‌లో నల్లరాళ్ల వద్ద పర్యాటకుల సందడి(ఫైల్‌)

- జిల్లాలో పట్టాలెక్కని పర్యాటక ప్రాజెక్టులు

- అభివృద్ధి కోసం 61 బీచ్‌ల గుర్తింపు

-పదేళ్లవుతున్నా అతీగతి లేదు

- గత వైసీపీ సర్కారులో నిర్లక్ష్యం

- కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి

జిల్లా తీర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పదేళ్ల కిందట 61 బీచ్‌లను అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంతవరకు ఆ ప్రాజెక్టులకు అతీగతి లేదు. గత వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో కూడా అదే నిర్లక్ష్యం నెలకొంది.

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఈ తీర ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. కానీ, గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో పర్యాటక రంగం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా పర్యాటక ప్రాజెక్టుల విషయంలో ఆశించిన పురోగతి లేదు. డొంకూరు, కవిటి, బారువ, అక్కుపల్లి, భావనపాడు, కళింగపట్నం, మొగదాలపాడు, కల్లేపల్లి, గనగళ్లపేట, బందరువానిపేట తీరాలు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.

పదేళ్లు అవుతున్నా..

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని 11 తీర మండలాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. తీరంలో 61 బీచ్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశముందని 2016లోనే గుర్తించింది. అందులో భాగంగా కళింగపట్నం బీచ్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని పర్యాటక పనులు మొదలుపెట్టారు కూడా. ఇంతలోనే అధికారం రావడం.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలో బాహుదా, మహేంద్రతనయా, వంశధార, నాగావళి నదీ సంగమాలు ఉన్నాయి. తీరానికి దగ్గరగా పురాణ, చారిత్రక, ఇతిహాసాలతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చిత్తడి, బీల నేలల సోయగాలు కూడా కనువిందు చేస్తాయి. విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడకు పక్షులు వస్తుంటాయి. తెలవారగానే కిలకిలారావాలతో నిద్రలేపుతాయి. పూండి, నౌపడ ఉప్పుగల్లీలు, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎర్రమట్టి దిబ్బలు, తీరంలో నల్ల రాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు నిరుద్యోగ యువతకు మెండుగా ఉపాధి లభిస్తుంది.

కళింగపట్నం తీరంలో ఘోరం..

గార మండలం కళింగపట్నం బీచ్‌ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా రకాలుగా అభివృద్ధి చెందింది. ఈ తీరంలో భారీ ఒంటెలతో పాటు కొన్నిరకాల జంతువుల ఆకృతులను ఏర్పాటుచేశారు. పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పర్యాటక ఉత్సవాలు కూడా జరిపారు. తీరం వరకూ రహదారులను సైతం ఏర్పాటు చేశారు. రిసార్ట్స్‌ సైతం నిర్మించారు. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైంది ఈ బీచ్‌ నిర్వహణను గాలికొదిలేసిన జగన్‌ సర్కారు రిసార్ట్స్‌లో బార్‌ను మాత్రం నడిపించింది.

బెంచీలు కూడా ఉండవు

జిల్లాలో చాలా బీచ్‌లు ఉన్నాయి. కానీ అక్కడ వసతులు లేవు. కేవలం సముద్రం చూసి రావడానికి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కనీసం తీరంలో బెంచ్‌ల ఏర్పాటు కూడా లేదు. అదే పక్కనే ఒడిశాలోని సోనాపూర్‌ బీచ్‌ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత.. మన బీచ్‌లపై ఇక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం చాలా బాధాకరం.

-బుడ్డెపు మేఘనాథ్‌, స్థానికుడు, ఇచ్ఛాపురం

ఒడిశా బీచ్‌లే దిక్కు..

జిల్లాలోని బీచ్‌ల్లో సరైన సదుపాయాలు లేవు. కుటుంబంతో వెళితే కూర్చోవడానికి వీలు లేకుండా పోతోంది. ఎండకు, వర్షానికి తలదాచుకుందామంటే చెట్లే గతి అవుతున్నాయి. అందుకే జిల్లా నుంచి ప్రజలు సేద తీరేందుకు ఒడిశా వెళుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరముంది.

- పసుపురెడ్డి బుజ్జి, స్థానికుడు, ఇచ్ఛాపురం

Updated Date - Feb 18 , 2026 | 11:54 PM