గుర్తించారు.. వదిలేశారు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:13 AM
Irregularities in Jagananna Housing Colony, Jagatimetta వైసీపీ ప్రభుత్వ హయాంలో టెక్కలి మండలం జగతిమెట్ట సమీపాన జగనన్న ఇళ్లకాలనీ పట్టాల పంపిణీలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫారసు మేరకు కొన్ని ఇళ్ల పట్టాలను అనర్హులకు, స్థానికేతరులకు పంపిణీ చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు సుమారు 9 మంది రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కానీ ఇంతవరకూ అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగతిమెట్ట జగనన్న ఇళ్ల కాలనీల్లో అక్రమాలు
అనర్హులు, స్థానికేతరులకు పట్టాలు పంపిణీ
అప్పటి రెవెన్యూశాఖ సిబ్బంది చేతివాటం
కూటమి అధికారంలోకి వచ్చినా చర్యలు నిల్
టెక్కలి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో టెక్కలి మండలం జగతిమెట్ట సమీపాన జగనన్న ఇళ్లకాలనీ పట్టాల పంపిణీలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫారసు మేరకు కొన్ని ఇళ్ల పట్టాలను అనర్హులకు, స్థానికేతరులకు పంపిణీ చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు సుమారు 9 మంది రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, స్టాంప్‌లు వేసి ఒక్కో కొన్ని పట్టాలను రూ.లక్షల్లో విక్రయించినట్టు రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. కానీ ఇంతవరకూ అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఈ జగనన్న ఇళ్ల కాలనీ పట్టాలకు సంబంధించి పలు రికార్డులు సైతం తహసీల్దార్ కార్యాలయంలో లభ్యం కాకపోవడం గమనార్హం. దీనిని బట్టి అప్పటి రెవెన్యూ యంత్రాంగం అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతోంది.
ఇదీ కథ
జగనన్న ఇళ్ల కాలనీ కోసం జగతిమెట్టలోని సర్వేనెం.288, 289ల్లో 9.20 ఎకరాల డీ పట్టా భూమిని 40 మంది రైతుల వద్ద గుర్తించి ల్యాండ్ ఎక్విజేషన్ పద్ధతిలో అప్పటి రెవెన్యూ అధికారులు సేకరించారు. ఒక్కో లబ్ధిదారుడికి సెంటున్నర స్థలం చొప్పున 389 పట్టాలను సిద్ధం చేశారు. డీ పట్టా భూమి తీసుకున్న రైతులకు నిబంధనల మేరకు ఒక్కో పట్టా అందించాలి. కానీ అప్పటి వైసీపీ నాయకుల సిఫారసు మేరకు సుమారు 70 పట్టాలను రైతులకు అందజేశారు. జగనన్న కాలనీలో 389 పట్టాలు అప్పట్లో అధికారులు పంపిణీ చేయగా, అందులో ఎక్కువశాతం అనర్హులు, స్థానికేతరులు కనిపిస్తున్నారు. అంతేకాకుండా 389 పట్టాల జాగాలో అదనంగా మరో 23 పట్టాలు పుట్టుకొచ్చాయి. అక్రమాల నేపథ్యంలో మొత్తం 412 పట్టాలయ్యాయి. వీటిలో కొన్ని అప్పటి వైసీపీ నాయకుల సిఫారసు మేరకు అనర్హులకు, స్థానికేతరులకు రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈ క్రమంలో రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాలను వెలికితీయాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి ఆదేశించింది. దీంతో ఆర్డీవో ఇతర మండలాల నుంచి ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని తెప్పించి విచారణ చేపట్టారు. పెద్దఎత్తున రెవెన్యూ సిబ్బంది చేతివాటం, ఫోర్జరీ వ్యవహారాల కారణంగా అనర్హులు, స్థానికేతరులు ఎంతో మంది పట్టాలు పొందారని గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారులు అప్పట్లో 18 ఇళ్ల పునాదులను తొలగించారు. మరో 40 వరకు బోగస్ పట్టాలు ప్రథమంగా గుర్తించారు. ఆర్డీవో అప్పట్లో పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని ఒక్కొక్కరిని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి పిలిచి విచారణ చేయగా విస్తుపోయిన నిజాలను తెలుసుకున్నారు. ఈ అక్రమాల తతంగంలో ఓ తహసీల్దార్ స్థాయి అధికారి, డీటీ, ఆర్‌ఐ, సర్వేయర్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్, నలుగురు వీఆర్‌వోల ప్రమేయం ఉందని ప్రాథమికంగా గుర్తించారు. జగతిమెట్ట కాలనీలో కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులు ‘ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమణదారులు శిక్షార్హులు’ అంటూ బోర్డులు సైతం పెట్టారు. కాగా వీటిని కొంతమంది తొలగించారు. ఒక దశలో ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ యంత్రాంగానికి అప్పగిస్తామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. ఆ తరువాత తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారుల రికార్డులు, వివరాలు లభ్యం కాలేదు. దీంతో విజిలెన్స్ విచారణ అంశం పక్కకు వెళ్లింది. అప్పటి రెవెన్యూ సిబ్బంది అక్రమాలను ఉన్నతాధికారులు గుర్తించినా వారిపై సస్పెన్షన్‌కు మాత్రం ఏడాదిగా తాత్సారం చేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా జగతిమెట్ట ఇళ్ల కాలనీ పట్టాల వ్యవహారం కలెక్టర్ దృష్టిలో ఉందన్నారు. దీనిపై మరింత లోతుగా మరోసారి విచారణ కొనసాగుతుందని తెలిపారు.