Share News

ఎల్‌నినో గుబులు

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:55 PM

Delayed Kharif cultivation వర్షాకాలం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సాగు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ కనిపించటం లేదు. మేఘాలు కమ్ముతున్నా.. పిడుగులు పడుతున్నా.. వర్షం మాత్రం ఆశించినస్థాయిలో కురవడం లేదు.

ఎల్‌నినో గుబులు
నందిగాం మండలంలో నీరు లేని చెరువు

  • ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు

  • ఆలస్యమవుతున్న ఖరీఫ్‌ సాగు

  • జిల్లాను వెంటాడుతున్న లోటు వర్షపాతం

  • ఆందోళనలో రైతులు

  • ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ సూచన

  • టెక్కలి మండల కొల్లివలస గ్రామానికి చెందిన సోమేశ్వరావు.. ఈ ఏడాది సుమారు 10 ఎకరాల భూమి కౌలుకి తీసుకొని సాగుకు సిద్ధమయ్యాడు. వరి విత్తనాలు జల్లేందుకు దుక్కులు చేపట్టాడు. కానీ ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడంతో.. సకాలంలో విత్తనాలు వేయలేకపోతున్నామని నిరాశ చెందుతున్నాడు.

  • టెక్కలి మండలం జగన్నాఽథపురానికి చెందిన సింగుపురం రమేష్‌ సుమారు ఐదు ఎకరాల్లో ఎదలు విధానంలో వరిసాగుకు పొలాన్ని సిద్ధం చేశాడు. విత్తనాలు జల్లేందుకు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నాడు.

  • టెక్కలి/ మెళియాపుట్టి జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సాగు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ కనిపించటం లేదు. మేఘాలు కమ్ముతున్నా.. పిడుగులు పడుతున్నా.. వర్షం మాత్రం ఆశించినస్థాయిలో కురవడం లేదు. తొలకరి జల్లు, దోని ప్రభావం, నైరుతిపవనాలు కూడా అంతంతమాత్రానికే పరిమితమయ్యాయి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితిలో ఖరీఫ్‌ సాగు ఎలా చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.

  • జిల్లాలో ఇదీ పరిస్థితి

  • జిల్లాలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 3.80 లక్షల ఎకరాల్లో వరి పండిస్తారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది ముందుగానే లక్ష టన్నుల విత్తనాలను రైతుసేవా కేంద్రాల ద్వారా అధికారులు అందించారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. ఎదలు, నారుమళ్లుకు విత్తనాలు 30 శాతానికిపైగా చల్లి.. వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఎల్‌నినో భయం వెంటాడుతుంది. శాస్త్రవేత్తలు సైతం 1985 నాటి కరువు పరిస్థితులు రావచ్చునని హెచ్చరించడం రైతులకు మరింత కుంగదీస్తోంది. ఈ నెల 16 నాటికే వంశధార కాలువల ద్వారా సాగునీరు విడిచిపెడతామని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ వర్షాలు లేక వంశధార కాలువల ద్వారా నీరు విడిచిపెట్టలేదు. మరోవైపు చెరువులు, వాగులు, గెడ్డల్లో సైతం నీటినిల్వలు కరువొచ్చాయి. ‘ఎల్‌నినో పరిస్థితుల కారణంగా వర్షాలు ఆలస్యంగా కురిసే అవకాశం ఉంది. వర్షాలు జాడ చూసుకొని రైతులు విత్తనాలు చల్లాల’ని మెళియాపుట్టి మండల వ్యవసాయశాఖ అధికారి దానకర్ణుడు తెలిపారు.

  • లోటు వర్షపాతం

  • జిల్లాలో గత నెల, ఈ నెల లోటు వర్షపాతం నమోదు కావడంతో రైతులు కలవరపడుతున్నారు. ‘మే నెలలో సాధారణంగా 100.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 42 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం. అలాగే జూన్‌లో ఇప్పటివరకూ 110.6 మిల్లీమీటర్లు వర్షం కురవాల్సి ఉండగా 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు 23 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉంద’ని టెక్కలి ఉపగణాంకాధికారి బాలక బాలచంద్ర తెలిపారు.

  • ప్రత్యామ్నాయ దిశగా..

  • ఎల్‌నినో ప్రభావంతో దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యవసాయశాఖ అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు చర్యలు చేపడుతోంది. వరికి బదులు రాగులు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, కూరగాయలు, చెరకు, మిర్చి వంటి సాధార ణ, వాణిజ్య పంటల వైపు దృష్టి సారించే దిశగా రైతులకు సూచనలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయశాఖ అధికారులు, వివిధ అనుబంధ శాఖల అధికారులు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతుల వద్దకు వెళ్లి ఎల్‌నినో పరిస్థితి ఓ పక్క చెబుతూ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:55 PM