Share News

మాజీ ఎమ్మెల్యే పగడాలమ్మ మృతి

ABN , Publish Date - May 13 , 2026 | 11:33 PM

పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మ బుధవారం మృతిచెందారు.

 మాజీ ఎమ్మెల్యే పగడాలమ్మ మృతి
అప్పటి ప్రముఖులతో ఉన్న ఫొటోను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే పగడాలమ్మ(ఫైల్‌)

- అనారోగ్యంతో స్వగృహంలో కన్నుమూత

- ఉమ్మడి రాష్ట్రంలో తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు

- శోకసంద్రంలో ముక్తాపురం

మెళియాపుట్టి/పాతపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మ బుధవారం మృతిచెందారు. అనారోగ్యంతో తన స్వగ్రామం మెళియాపుట్టి మండలం ముక్తాపురంలో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు మూడురోజుల కిందట విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యసేవలు అందించారు. అనంతరం ముక్తాపురంలోని స్వగృహానికి చేరుకోగా బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం అంతిమసంస్కారాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పగడాలమ్మ 1972నుంచి 1978వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆరేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆనాడు దళిత మహిళా ఎమ్మెల్యేగా ఈమె ఒక్కరే ఉండడంతో ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో సైతం సాన్నిహిత్యం ఉండేది. అప్పటి ముఖ్యమంత్రులుగా పనిచేసిన పీవీ నరసింహరావు, జలగం వెంగళరావు వద్ద ఎమ్మెల్యేగా పనిచేసి నిస్వార్ధపరురాలిగా గుర్తింపు పొందారు. ఆనాడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవకాశమిచ్చినప్పటికీ తన ఆర్థికపరిస్థితి బాగోలేకపోవడంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి రూ.18వేలు ఇచ్చారని, ఆ డబ్బులను ఖర్చుచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు పగడాలమ్మ చెబుతుండేవారు. అప్పట్లో ఎమ్మెల్యేకు ప్రతినెలా రూ.350 జీతం ఇచ్చేవారని, అవి ఖర్చుచేస్తూ తనభర్త దాసుతోపాటు సైకిల్‌పై తిరుగుతూ గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకునేదానినని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. అదే విధంగా నియోజకవర్గంలో అనేక గ్రామాలు విద్యుత్‌ సౌకర్యంలేక చీకట్లో ఉండేవని, ఆనాడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు నింపినట్లు చెప్పేవారు.

ఆలాంధ్ర రోడ్‌ వేసిన ఘనత..

పాతపట్నం నుంచి మెళియాపుట్టి వరకూ ఆలాంధ్ర రోడ్‌ వేయించిన ఘనత పగడాలమ్మకే దక్కుతుంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నియోజకవర్గం పాతపట్నం కావడంతో ఇక్కడి ప్రజలు ఒడిశాకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీంతో పగడాలమ్మ అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి మొదట గ్రావెల్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మార్గంలో ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. ఇప్పటికీ ఆలాంధ్ర రోడ్‌ అంటే చుక్క పగడాలమ్మ పేరే వినిపిస్తుంది.

ఎన్నో ఆర్థిక కష్టాలు..

పగడాలమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ముక్తాపురంలో పెద్దకుమార్తె అలాకాన జయప్రద వద్ద ఉంటూ కన్నమూశారు. ఆమె మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడేవారు. ఉండడానికి మంచి ఇల్లు లేక ఇబ్బందులు పడేవారు. శిథిలమైన పెంకుటిల్లులోనే జీవనం సాగించేవారు. ఎవరు కనిపించినా తన ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ కన్నీరుపెట్టేవారు. ఆమె పరిస్థితిని ఎన్నో పత్రికలు వెలుగులోకి తీసుకువచ్చాయి. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేల పింఛన్‌ను రూ.50వేల వరకూ పెంచడంతో పగడాలమ్మ ఆర్థిక కష్టాలు కొంత వరకూ తీరాయి. ఆమె మృతితో ముక్తాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. పగడాలమ్మ మృతిపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ముక్తాపురం వెళ్లి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబీకులను పరామర్శించారు. మాజీఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కలమట వెంకటరమణమూర్తి, కలమట మోహన్‌రావు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 11:33 PM