దొరికిపోయారు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:21 AM
Aarav Varma and friend Siddhartha Tyadi arrested రోడ్డు ప్రమాదంలో ఒక నిరుపేద ప్రాణం పోతే.. దానికి కారకుడైన తన కొడుకును చట్టం నుంచి తప్పించేందుకు యత్నించిన మాజీమంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అడ్డంగా బుక్కయ్యారు. ప్రమాదానికి కారణమైన ఆయన పెద్ద కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు పోలీసులకు సోమవారం లొంగిపోయాడు.
ఆరవ్‌వర్మ, స్నేహితుడు సిద్ధార్థ త్యాడి అరెస్టు
వ్యవస్థలను తప్పుదోవ పట్టించినందుకు మాజీమంత్రి అప్పలరాజుపైనా కేసు
ఆంధ్రజ్యోతి కథనంతో బట్టబయలైన నిజం
శ్రీకాకుళం/పలాస, జూలై 13(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒక నిరుపేద ప్రాణం పోతే.. దానికి కారకుడైన తన కొడుకును చట్టం నుంచి తప్పించేందుకు యత్నించిన మాజీమంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అడ్డంగా బుక్కయ్యారు. ప్రమాదానికి కారణమైన ఆయన పెద్ద కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు పోలీసులకు సోమవారం లొంగిపోయాడు. సోమవారం రాత్రి ఆరవ్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చిన ఆరవ్ స్నేహితుడు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలి కుమారుడైన సిద్ధార్థ త్యాడిని కూడా అరెస్టు చేశారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించినందుకు మాజీమంత్రి అప్పలరాజుపైనా కేసు నమోదు చేశారు.
ఆసుపత్రి నుంచి కోర్టుకు..
సోమవారం మధ్యాహ్నం నాయ్యవాదితో కలిసి కాశీబుగ్గ పోలీసుల ఎదుట నిందితులు లొంగిపోగా.. రాత్రికి వారిని అధికారికంగా అరెస్టు చేశారు. ఆరవ్‌వర్మపై బీఎన్‌ఎస్ 105, 61(2), 106(1), 49 రెడ్‌విత్ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు ముందుగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి పలాస మున్సిపల్ కోర్టుకు తీసుకెళ్లి న్యాయాధికారి ఎదుట హాజరుపర్చారు.
గుట్టరట్టు చేసిన సీసీ పుటేజీ
శుక్రవారం రాత్రి పలాస పారిశ్రామికవాడ రోడ్డులో ఆరవ్ వర్మ బుల్లెట్‌ను అతివేగంగా నడుపుతూ.. గొర్రెల కాపరి దుబ్బ దానయ్యను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసు నుంచి ఆరవ్‌ను తప్పించాలని సీదిరి అప్పలరాజు యత్నించారు. ఆరవ్ స్నేహితుడైన సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా సృష్టించారు. మంత్రి, అనుచరులు ఎంత మేనేజ్ చేసినా.. ఓ లారీ డ్రైవర్ రూపంలో నిజం బయటపడింది. దీనికి తోడు ఆంధ్రజ్యోతి ఈ వ్యవహరాన్ని ఆదివారం ప్రధాన సంచికలో వెలుగులోకి తేవడంతో కేసు మలుపు తిరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఆరవ్ వర్మ పెట్రోల్ బంక్ వద్ద బుల్లెట్ పై ఉన్న దృశ్యాలు, ఆసుపత్రికి అతడిని అప్పలరాజే తీసుకెళ్లిన సీసీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. దీంతో దొరికిపోయారు.