మతిమరుపు.. ముప్పు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:14 AM
Today is World Alzheimer's Day మానవుడి జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తిని పెంపొందించడంలో మెదడు కీలకమైనది. దీనిని నిర్లక్ష్యం చేయకుండా నిత్యం చురుగ్గా ఉంచేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే మతిమరుపు ముప్పు తప్పదని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
60 ఏళ్లు దాటితే తస్మాత్ జాగ్రత్త
వ్యాధి ముదిరితే.. మంచానికే పరిమితం
జిల్లాలో పెరుగుతున్న బాధితులు
నేడు ప్రపంచ అల్జీమర్స్ డే
నరసన్నపేట, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): మానవుడి జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తిని పెంపొందించడంలో మెదడు కీలకమైనది. దీనిని నిర్లక్ష్యం చేయకుండా నిత్యం చురుగ్గా ఉంచేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే మతిమరుపు ముప్పు తప్పదని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. జ్ఞాపకశక్తి తగ్గిపోయి... బంధువులు, స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులను సైతం మరిచిపోయే స్థాయికి చేరుకుంటారు. దీనినే మతిమరుపు వ్యాధి(అల్జీమర్స్) అంటారు. 1906లో ఆల్‌జేమర్స్ అనే జర్మనీ న్యూరో పైథాలజిస్ట్ ఈ వ్యాధిని కనుగొన్నాడు. ఆయన జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబరు 21న ప్రపంచ అల్జీమర్స్ డేగా ప్రకటించారు. సోమవారం అల్జీమర్స్ డే సందర్భంగా జిల్లాలో పరిస్థితి తెలుసుకుందాం. జిల్లాలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ప్రస్తుతం 20వేల మందికిపైగా బాధితులు మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి అయిన మతిమరుపుతో బాధపడుతున్నారు. 65 నుంచి 75 ఏళ్ల వయసులో ఉన్నవారిలో 10 శాతం, 85 ఏళ్లు దాటినవారు 60శాతం మేరకు ఈ వ్యాధికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన లేమి.. ప్రజల జీవనశైలిలో మార్పులు ఫలితంగా ఎక్కువగా అల్జీమర్స్‌కు గురవుతున్నారు. విద్యార్థి దశ నుంచే చదువుపై ఒత్తిడితో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. ఉద్యోగాలు, కుటుంబ వ్యవహారాల్లో కొంతమంది ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. ఈక్రమంలో అల్జీమర్స్ బారిన పడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటితే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలపైనా దృష్టి సారించాలని పేర్కొంటున్నారు.
వ్యాధిలో దశలు..
ప్రారంభ దశ: ఒకటి నుంచి రెండేళ్ల కాలంలో వృద్ధ్దాప్యం వల్ల వచ్చే లక్షణాలు అంతగా కనిపించవు. మాట్లాడటంలో ఇబ్బందులు, ప్రదేశాలు మర్చిపోవడం, మానసిక పరివర్తనలో మార్పులు, తమలో తామే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మధ్య దశ: రెండు నుంచి ఐదేళ్లలో వ్యాధి త్రీవత పెరుగుతుంది. రోజువారీ పనులు చేసుకోలేకపోతారు. స్నాన, మల, మూత్రవిసర్జనకు కుటుంబ సభ్యులపై ఆధారపడతారు.
చివరిదశ: ఐదేళ్ల నుంచి మతిమరుపు ఎక్కువగా ఉండటం. తినడానికి, నడవడానికి ఎక్కువ ఇబ్బంది పడతారు. మంచానికే పరిమితమవుతారు.
కారణాలు ఇవే..
మద్యపానం, పక్షవాతం, మెదడు కేన్సర్, ఇన్‌ఫెక్షన్, శరీరంలో విటమిన్ బీ12 తగ్గడం వల్ల మతిమరుపు వస్తుంది. వీటితోపాటు మందుల వల్ల వచ్చే దుష్పరిణామాలు, థైరాయిడ్, మూత్రపిండాలు, కాలేయవ్యాఽధులు కూడా మతిమరుపునకు కారణమవుతాయి. తలకు గాయం కావడం, అధిక రక్తపోటు, అధిక కొవ్వుశాతం వల్ల కూడా మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. మానసిక, శారీరక పరివర్తనలో మార్పు వచ్చి.. జ్ఞాపకశక్తిని కోల్పోతారు.
ఇలా చేస్తే మంచిది..
మతిమరుపు వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదు. మందులతో కొద్దిగా నయం చేయవచ్చు. ప్రాథమిక దశలోనే వ్యాఽధి నిర్ధారణ చేయాలి. మెదడుకు పదునుపెట్టే విధానాలను అలవరచుకోవాలి. సరదా ఆటలు, పజిల్స్ వంటివి చేయాలి. యోగా, శారీరక వ్యాయామం, ధ్యానం వంటివి ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్థి దశ నుంచే వీటిని అలవరచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం వద్దు
మతిమరుపు వ్యాధిని నిర్లక్ష్యం చేయరాదు. ఎప్పటిక ప్పుడు వైద్యులను కలిసి చికిత్స చేయించుకోవాలి. లేదంటే పరిస్థితి విషమించే అవకాశం ఉంది. మందుల కంటే కుటుంబ సభ్యుల సహకారం అవసరం.
- తండ్యాల నరేష్, న్యూరాలజిస్టు, శ్రీకాకుళం
జాగ్రత్తగా చూసుకోవాలి..
మతిమరుపు వ్యాధిగ్రస్తులను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే నయం చేసే వీలుంటుంది. నివారణకు మందులు ఉండవు కాబట్టి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలి.
- డా.పొన్నాడ గణేష్, సూపరింటెండెంట్, సామాజిక ఆసుపత్రి, కోటబొమ్మాళి