విదేశీ పక్షులు విలవిల
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:13 AM
జిల్లాలో ఉన్న విదేశీ విహంగ కేంద్రాల్లో ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి ఒకటి.
- తేలుకుంచి విడిది కేంద్రంపై నిర్లక్ష్యం
- సరైన ఏర్పాట్లు లేక పక్షులు మృత్యువాత
- పట్టించుకోని గత వైసీపీ సర్కారు
- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
ఇచ్ఛాపురం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న విదేశీ విహంగ కేంద్రాల్లో ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి ఒకటి. ఈ ప్రాంతం చిత్తడి, తంపర నేలలకు ప్రసిద్ధి కావడంతో ఇక్కడ పక్షులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఈ ప్రాంతం సొంతం. అందుకే ఏటా ఇక్కడకు సైబిరియా, జర్మనీ, ఆస్ర్టేలియా, సింగపూర్, మలేసియా, హంగేరి దేశాల నుంచి సుమారు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు విదేశీ పక్షులు చేరుతుంటాయి. ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబరులో ఇక్కడకు వస్తుంటాయి. సుమారు ఆరేడు, నెలల పాటు ఇక్కడే ఉంటాయి. గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరుపుతాయి. పిల్లలు పెద్దాయ్యాక మార్చి, ఏప్రిల్‌లో తిరుగు పయనమవుతాయి. ఇవి వస్తే పంటలు బాగా పండుతాయని రైతుల ప్రగాడ నమ్మకం. అయితే, ఈ కేంద్రాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. విదేశీ పక్షుల కోసం ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సంతానోత్పత్తి చేసే క్రమంలో గుడ్లతో పాటు పక్షులు కిందకు జారిపడి మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అటవీ, పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కనీసం చెట్లకు వలలు ఏర్పాటు చేసినా కొంత వరకు పక్షుల మృత్యువాతను అడ్డుకోవచ్చు. కానీ అటువంటి ఏర్పాట్లు ఏవీ చేయడం లేదు. దీనికితోడు కోతులతో పక్షులకు అష్టకష్టాలు తప్పడం లేదు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ కేంద్రాన్ని గాలికొదిలేసింది. పరిసరాలు అధ్వానంగా మారాయి. అటు పక్షుల మల, మూత్ర విసర్జనతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు దుర్గంధం మాటున గడపాల్సి వస్తోంది. కనీసం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేస్తే పక్షులకు కొంతవరకు ఉపయోగపడే అవకాశముంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విదేశీ పక్షుల విడిది కేంద్రంపై దృష్టి సారించింది. అవసరమైన ఏర్పాట్లకు త్వరలో నిధులు విడుదల అవుతాయని పర్యాటక, అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
అభివృద్ధికి ప్రతిపాదనలు..
అటవీ, పర్యాటక శాఖ సంయుక్తంగా చర్యలు చేపడితే విదేశీ పక్షుల విడిది కేంద్రం అభివృద్ధి చెందే అవకాశముంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కొన్నిరకాల నిర్మాణాలు జరిగాయి. చివరిగా 2019లో టీడీపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అధికారం మారడంతో అవన్నీ బుట్టదాఖలు అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో పర్యాటక శాఖకు ఎటువంటి కేటాయింపులు లేవు. ప్రస్తుతం తేలుకుంచితో పాటు తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు వెళ్లాయి. వాటికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశముంది.