Share News

ఏడోసారి.. పీఠం ఎవరిదో?

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:26 AM

An interesting contest in Ichchapuram Municipality జిల్లాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఏడోసారి మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ఆశి లీలారాణి తొలిసారి బరిలో దిగారు. వైసీపీ తరపున ఇప్పటికే రెండుసార్లు చైర్‌పర్సన్‌గా పనిచేసిన పిలక రాజలక్ష్మి మూడోసారి మునిసిపల్‌ బరిలో దిగుతున్నారు. వీరిద్దరిలో పీఠం ఎవరిదోనన్న చర్చ సాగుతోంది.

ఏడోసారి.. పీఠం ఎవరిదో?
ఇచ్ఛాపురం మున్సిపాల్టీ

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఆసక్తికర పోరు

  • ఇప్పటివరకూ ఆరుసార్లు ఎన్నికలు

  • కాంగ్రెస్‌ మూడుసార్లు, వైసీపీ రెండుసార్లు విజయం

  • ఒకసారే గెలిచిన టీడీపీ

  • ఇచ్ఛాపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఏడోసారి మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ఆశి లీలారాణి తొలిసారి బరిలో దిగారు. ఈమె టీడీపీ ఇచ్ఛాపురం పట్టణ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అన్నక్యాంటీన్‌ సలహా కమిటీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. గత మునిసిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా కూడా గెలిచి సేవలందించారు. తాజాగా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక వైసీపీ తరపున ఇప్పటికే రెండుసార్లు చైర్‌పర్సన్‌గా పనిచేసిన పిలక రాజలక్ష్మి మూడోసారి మునిసిపల్‌ బరిలో దిగుతున్నారు. వీరిద్దరిలో పీఠం ఎవరిదోనన్న చర్చ సాగుతోంది.

  • నాలుగు దశాబ్దాల కిందట

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీ నాలుగు దశాబ్దాల కిందట ఏర్పాటైంది. జిల్లాకేంద్రం శ్రీకాకుళం తరువాత జిల్లాలో ఏర్పడిన తొలి మునిసిపాలిటీ కూడా ఇదే. ఒడిశా సరిహద్దులో ఉండే ఈ పట్టణం జిల్లాలోనే అత్యంత కీలకమైన పట్టణ స్థానిక సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడి ప్రజలు తెలుగుతో పాటు ఒరియా భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇక్కడ బీసీ సామాజికవర్గాలే అధికం. ఇచ్ఛాపురం మునిసిపాలిటీ 1986లో ఏర్పడింది. గ్రేడ్‌-3 మునిసిపాలిటీ ఇది. గతంలో 23 వార్డులు ఉండేవి. ఇటీవల పునర్విభజనతో వార్డుల సంఖ్య 28కి పెరిగింది. ప్రస్తుతం 31,452 మంది ఓటర్లు ఉన్నారు. భౌగోళికంగా దాదాపు 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. పట్టణానికి ఆనుకొని ఉన్న బెల్లుపడ, బెల్లుపడ కాలనీ వంటి వాటితో మునిసిపాలిటీగా అవతరించింది.

  • 1987లో తొలిసారిగా మునిసిపల్‌ ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పిలక పద్మావతి విజయం సాధించారు. 30-03-1987 నుంచి 30-03-1992 వరకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.

  • రెండో పాలకవర్గానికి సంబంధించి 1995-2000లో మాత్రం టీడీపీకి చెందిన కాళ్ల వెంకట లక్ష్మి చైర్‌పర్సన్‌గా గెలిచారు. 31-03-1995 నుంచి 28-03-2000 వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు.

  • 2001లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పిలక పోలారావు విజయం సాధించారు. 29-03-2000 నుంచి 28-03-2005 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు.

  • 2005లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన లాభాల స్వర్ణమణి విజయం సాధించారు. 29-10-2005 నుంచి 02-09-2010 వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు.

  • 2014, 2021 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన పిలక రాజలక్ష్మి చైర్‌పర్సన్‌గా వరుసగా రెండుసార్లు గెలిచారు. 23-08-2014 నుండి 18-03-2026 వరకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆమె వైసీపీ అభ్యర్థిగా ఖరారు కావడం విశేషం. ఈమె దివంగత పిలక పోలారావు కోడలు. ఆ కుటుంబం మూడుసార్లు గెలిచి ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో బలమైన ముద్ర చాటుకుంది.

Updated Date - Oct 18 , 2026 | 12:26 AM