రాజకీయ మనుగడ కోసమే..
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:35 AM
False propaganda on port works ‘రాజకీయ మనుగడ కోసం వైసీపీ నాయకులు పాకులాడుతున్నారు. ఈక్రమంలో మూలపేట పోర్టు పనుల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నార’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
పోర్టు పనులపై అసత్య ప్రచారాలు
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ మనుగడ కోసం వైసీపీ నాయకులు పాకులాడుతున్నారు. ఈక్రమంలో మూలపేట పోర్టు పనుల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నార’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో జిల్లా అభివృద్ధిని విస్మరించి.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భావనపాడులో పోర్టు నిర్మాణానికి ఎంతో కృషి చేశాం. కేంద్ర సంస్థలు, నిపుణుల కమిటీలు పలు అధ్యయనాలు నిర్వహించి అనుకూల పరిస్థితులు తీసుకువచ్చాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూలపేటకు పోర్టు నిర్మాణ స్థలాన్ని మార్చి.. కేవలం 20 పనులు కూడా చేయలేదు. కూటమి పాలనలో 90 శాతం పనులు పూర్తిచేశాం. పోర్టుతోపాటు జాతీయ రహదారి విస్తరణ, పోర్టు వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణం, రైల్వేలైన్ అనుమతులు, రైతులను ఒప్పించి భూముల సమీకరణ వంటివి విజయవంతంగా చేపట్టాం. పనులు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రజల్లో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే భయంతో వైసీపీ నాయకులు మళ్లీ అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారు. వైసీపీ హయాంలో 80 శాతం పనులు పూర్తిచేశామని చెప్పడం హాస్యాస్పదం. ముందస్తు అనుమతులు లేకుండా వేలాది మందితో పోర్టు సందర్శన పేరుతో సభలు పెట్టి, తామే పోర్టు నిర్మాణం పూర్తి చేశామని చెప్పడం ప్రజలను మోసగించడమే. వాస్తవానికి పోర్టును చూడాలనుకుంటే అనుమతులు తీసుకుని కొద్ది మంది ముఖ్య నాయకులు వెళ్లి పరిశీలించవచ్చు. కానీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు ప్రాంతానికి వేలాది మందితో వెళ్లేందుకు అనుమతి కోరడం బాధ్యతారాహిత్యామ’ని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీ నాటకాలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేత వెలమల కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.