Share News

రూ.20వేలు ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:55 PM

The VRO was caught by ACB officials భూముల రీ-సర్వే చేసి, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ లావేరు మండలం లోపెంట గ్రామ సచివాలయ వీఆర్వో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

రూ.20వేలు ఇవ్వాల్సిందే
లోపెంట సచివాలయంలో వీఆర్వో మల్లేశ్వరరావు(వృత్తంలో వ్యక్తి)ను విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు

  • భూములు రీ-సర్వే, పాస్‌పుస్తకం కోసం వీఆర్వో డిమాండ్‌

  • ఏసీబీని ఆశ్రయించిన రైతు

  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

  • శ్రీకాకుళం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): భూముల రీ-సర్వే చేసి, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ లావేరు మండలం లోపెంట గ్రామ సచివాలయ వీఆర్వో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం చిన్నఅజ్జరాం గ్రామానికి చెందిన కొయ్య గోవిందరావు కుమారుడు కొయ్య సత్యనారాయణ(50) అనే రైతుకు లావేరు మండలం లోపెంట గ్రామంలో భూములు ఉన్నాయి. వీటికి రీ-సర్వేతోపాటు 1-బీ రికార్డులు అప్‌డేట్‌ చేసి, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మంజూరు చేయాలని లోపెంట సచివాలయం వీఆర్వో అరుబారికి మల్లేశ్వరరావును ఇటీవల సత్యనారాయణ కోరాడు. ఇందుకోసం వీఆర్వో రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీనిపై సత్యనారాయణ శ్రీకాకుళంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేలా పథకం పన్నారు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారుల సూచన మేరకు.. సత్యనారాయణ వీఆర్వోకు ఫోన్‌ చేసి.. లావేరు మండలం శాపురం వద్ద మురపాక వెళ్లే రహదారి వద్దకు వస్తే డబ్బులిస్తానని చెప్పాడు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 1.25 గంటలకు వీఆర్వో అక్కడకు చేరుకుని.. సత్యనారాయణ నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. వీఆర్వో మల్లేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం-1988 కింద సెక్షన్‌ 7(ఏ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

  • వీఆర్వో మల్లేశ్వరరావుది లావేరు మండలం మురపాక. 2006లో విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)గా ప్రభుత్వ సర్వీసులో చేరాడు. అనంతరం 2017లో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో)గా పదోన్నతి పొంది రణస్థలం మండలం తెప్పలవలస గ్రామంలో పనిచేశాడు. ఆ తర్వాత 2022 జూలై 1న బదిలీపై లోపెంట గ్రామ సచివాలయానికి వచ్చి, అప్పటి నుంచి అక్కడే గ్రేడ్‌-2 వీఆర్‌వోగా విధులు నిర్వరిస్తున్నాడు. మురపాకలోని వీఆర్వో ఇంటి వద్ద సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు. పనితీరు ఎలా ఉండేది. ఉద్యోగ నిర్వణలో అవినీతి ఆరోపణలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రణస్థలం మండలంలో కొవ్వాడ మత్స్యలేశంలో పనిచేసేటప్పుడు సైతం వీఆర్వోపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

  • అవినీతిపై సమాచారం ఇవ్వండి

  • ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 లేదా 9440440057 కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ విజయవాడ హెడ్‌క్వార్టర్స్‌ పీఆర్వో ఒక ప్రకటనలో కోరారు. ‘‘కంప్లయింట్స్‌-ఏసీబీ యట్‌దారేటాఫ్‌ ఏపీ.జీవోవీ.ఇన్‌’’ ఈమెయిల్‌ ద్వారా కూడా స్థానిక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుదారుల వివరలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Updated Date - Aug 05 , 2026 | 11:55 PM