ఎనిమిదేళ్లుగా..
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:29 PM
Flyover work delayed జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పాతపట్నంలో చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఓ వైపు స్థల సేకరణ సమస్య, మరోవైపు డిజైన్‌లో మార్పులు.. జాప్యానికి కారణమవుతున్నాయి
నత్తనడకన ఫ్లైఓవర్ పనులు
పూర్తికాని స్థల సేకరణ
డిజైన్‌లో మార్పులతో జాప్యం
ప్రజలకు తప్పని ఇబ్బందులు
పాతపట్నం ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పాతపట్నంలో చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఓ వైపు స్థల సేకరణ సమస్య, మరోవైపు డిజైన్‌లో మార్పులు.. జాప్యానికి కారణమవుతున్నాయి. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లవుతున్నా.. పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం చేసేలా.. జాతీయ రహదారి విస్తరణ పనులకు 2018లో శ్రీకారం చుట్టారు. ఆంధ్రాలో నరసన్నపేట సమీపాన జమ్ము కూడలి నుంచి ఒడిశాలోని మోహన వరకు 326ఏ జాతీయ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు జమ్ము కూడలి నుంచి పాతపట్నంలోని ఒడిశా సరిహద్దుగల మహేంద్రతనయ నదిపై స్నేహవారధి వరకూ 39 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి రూ.141 కోట్లు మంజూరయ్యాయి. అలాగే తిలారు, పాతపట్నం ప్రాంతాల్లో రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణానికి గాను మరో రూ.41 కోట్లు చొప్పున మంజూరు చేశారు. తిలారు ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. కానీ పాతపట్నం ఫ్లైఓవర్ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి 2021 నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తిచేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ పూర్తిచేయకపోవడంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాతపట్నం శ్రీనీలమణి దుర్గమ్మ ఆలయానికి దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఒడిశా వాసులు, పాతపట్నంతోపాటు పరిసర ప్రాంతవాసులు టెక్కలి, శ్రీకాకుళం, హిరమండలం, పాలకొండ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఈ రైల్వేగేటు దాటాల్సిందే. ఈ రైల్వేమార్గంలో రోజుకు సుమారు ఎనిమిది సార్లు గేటు పడుతుండడంతో ఆ సమయంలో వాహనాలు బారులుదీరుతున్నాయి. నిత్యం వాహనరాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు చొరవచూపి త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పాతపట్నంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భూసేకరణ పూర్తికాలేదు. అలాగే భక్తుల కోరిక మేరకు శ్రీనీలమణి దుర్గమ్మ ఆలయం ఎదురుగా రోడ్డు మూసివేయకుండా పిల్లర్లు వేసేలా నమూనాలో మార్పులు చేశారు. ఈ కారణాలతో పనుల్లో జాప్యమవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.