17 మందికి.. ఇద్దరే హాజరు
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:41 PM
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో ఆ ఆస్పత్రిని నిర్మించింది.
- సూపరింటెండెంట్ సైతం గైర్హాజరు
- ఇదీ పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో వైద్యుల తీరు
- ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలో బట్టబయలు
పలాస, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో ఆ ఆస్పత్రిని నిర్మించింది. అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. పదుల సంఖ్యలో వైద్యులను నియమించింది. కానీ, కొందరి వైద్యుల తీరుతో ఆస్పత్రి ప్రతిష్ట మసకబారుతోంది. సమయానికి విధులకు రావడం లేదు. ఎన్ని గంటలకు వస్తారో.. అసలు వస్తారో.. రారో తెలియని తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పలాసలోని కిడ్నీ ఆస్పత్రి-పరిశోధన కేంద్రంలోని పరిస్థితి. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఉదయం 10.15 గంటలకు ఆసుపత్రిని సందర్శించారు. వైద్యుల హాజరుపట్టి, వారి చాంబర్లను పరిశీలించారు. ఆ సమయంలో 17 మంది వైద్యులకు గాను ఇద్దరు మాత్రమే విధులకు హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు పట్టిలో వారి సంతకాలే ఉన్నాయి. మిగిలిన వారు ఎక్కడని విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రామ్‌నరేష్‌ను ప్రశ్నించారు. వస్తున్నారని ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్నిగంటలకు విధులకు హాజరు కావాల్సి ఉందని ఆమె ప్రశ్నించడంతో.. ఉదయం 9 గంటలకు అని ఆయన తెలిపారు. దీంతో వైద్యులు, సిబ్బందికి క్లాస్ పీకారు. ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకొని మరో ఇద్దరు వైద్యులు అక్కడకు చేరుకున్నారు. తాము కూడా విధులకు వచ్చామని చెప్పడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది, రోగులకు అందుతున్న సేవలను నిత్యం పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ సైతం గైర్హాజరు కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తారని రోగులు చెప్పారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా..
వైద్యాధికారులు రోగులకు అందుబాటులో లేకపోతే ఆసుపత్రికి ఎవరు వస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక్కడ సూపర్‌స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్న విషయం ప్రజలకు తెలియకపో వడం వెనుక వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి గాడిలో పెడతామని ఆమె స్పష్టం చేశారు.