సిక్కోలులో బాపూ బాట
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:16 AM
Today is Gandhi Jayanti అహింసను అస్త్రంగా మలచి, శాంతియుత పోరాటంతో బ్రిటీష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన మహాత్మాగాంధీ జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. సభలు, సమావేశాలతో ప్రజలను ఉత్తేజపరిచారు.
105 ఏళ్ల కిందట మహాత్ముని తొలి అడుగు
జిల్లాలో మూడుసార్లు పర్యటనతో ఉద్యమ స్ఫూర్తి
నేడు గాంధీ జయంతి
ఎచ్చెర్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): అహింసను అస్త్రంగా మలచి, శాంతియుత పోరాటంతో బ్రిటీష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన మహాత్మాగాంధీ జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. సభలు, సమావేశాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్‌ఇండియా ఉద్యమాల్లో సిక్కోలు పౌరుషాన్ని జాతీయ వేదికపై ముందువరుసలో నిలిపారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని.. జిల్లాలో బాపూ వేసిన బాటలను స్మరించుకుందాం.
1921లో తొలిసారిగా
మహాత్ముని అడుగులు తొలిసారిగా 1921లో సిక్కోలు గడ్డపై పడ్డాయి. బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ సభకు మహాత్మాగాంధీ కోల్‌కత్తా నుంచి వస్తూ ఆంధ్రాలోని కొన్ని పట్టణాల్లో పర్యటించారు. 1921 మార్చి 28న కోల్‌కత్తా మెయిల్‌లో వస్తూ బరంపురం రైల్వేస్టేషన్‌లో దిగారు. బరంపురం టౌన్‌హాల్‌ని మహిళా సభలో ఆయన ప్రసంగించారు. తర్వాత 29న రాత్రి సిక్కోలు గడ్డ మీదుగా విజయనగరానికి పయనమయ్యారు. ఈక్రమంలో ఆంగ్లేయులపై వ్యతిరేక పోరాట ఉద్యమస్ఫూర్తి నింపారు.
1927లో మరోసారి
మందస, బొబ్బిలి, పర్లాకిమిడి ప్రాంతాల్లో జమీందారీ వ్యతిరేక పోరాటాల తీరుతెన్నులను పరిశీలించేందుకు 1927 డిసెంబరు 2 నుంచి మూడు రోజులపాటు బాపూజీ.. జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం, మెళియాపుట్టి, సారవకోట, నౌపడ, పూండి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలను సందర్శించి ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపారు. శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం నాగావళి హోటల్ ఉన్న స్థలంలో మహాత్మునికి పౌరసన్మానం చేశారు. మునిసిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో గాంధీజీ ప్రసంగించి.. స్వాతంత్య్ర నినాదాన్ని వినిపించారు. తొలిరోజు పాలకొండ రోడ్‌లో ఎంబాడ హనుమంతురావు ఇంట్లో బస చేశారు. గాంధీజీ వాహనం వంశధార నదిని దాటేందుకు వీలుగా ప్రస్తుత మడపాం వంతెన వద్ద ప్రత్యేకంగా కాజ్‌వేను నిర్మించారు. మడపాం మీదుగా సారవకోట వెళ్తూ.. తిలారు రైల్వే క్రాస్‌రోడ్ వద్ద గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి గాంధీజీ మాట్లాడారు. నరసన్నపేటలో తిలారు సంత మార్గంలో.. స్వాతంత్య్ర సమరయోధుడు పొట్నూరు స్వామిబాబు బాపూజీ కోసం ప్రత్యేక విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. ఇది గాంధీజీ గెస్ట్‌హౌస్‌గా చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే 1927 డిసెంబరు 3న సారవకోట మెయిన్ రోడ్‌లోని రహదారి బంగ్లాలో గాంధీజీ బస చేశారు. దీనిని 1991 జనవరి 1న గాంధీజీ స్మారక గ్రంథాలయంగా నామకరణం చేశారు. మెళియాపుట్టిలో గాంధీజీ ప్రారంభించిన ఖాదీ కేంద్రాన్ని గాంధీ మండపంగా వ్యవహరించారు. ఉప్పు తయారీకి ప్రధాన కేంద్రమైన నౌపడ గ్రామ రైతులు, శ్రామికులతో పూండిలో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఇచ్ఛాపురంలోని పాల్గొని ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశారు.
1942లో మూడోసారి
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ మూడోసారి జిల్లాకు వచ్చారు. బాపూజీ దూసి రైల్వే స్టేషన్‌కు వస్తున్నారన్న సమాచారంతో బ్రిటీష్ పోలీసులు నిఘా, ఆంక్షలను లెక్కచేయకుండా వేలాది మంది సమరయోధులు, సామాన్యులు తరలివచ్చారు. దీంతో గాంధీజీ రైలు బోగి తలుపు వద్ద నిలబడే హిందీలో సుమారు 15 నిమిషాలపాటు ప్రసంగించి ప్రజలను సమరయోధులుగా మార్చారు. నాడు ఆ పర్యటన జ్ఞాపకంగా స్టేషన్ ఆవరణలో నాటిన మొక్క నేడు మహావృక్షమై, నాటి ఉద్యమ స్శృతులకు సజీవసాక్ష్యంగా నిలిచింది.