రైల్వే కనెక్టివిటీపై దృష్టి
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:18 AM
శ్రీకాకుళం జిల్లా రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో హన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.
శ్రీకాకుళం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో హన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం న్యూఢిల్లీ రైల్ భవన్‌లో ఆ శాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాను న్న సౌత్‌కోస్ట్ రైల్వే (స్కోర్) జోన్ పనులను మరింత వేగవంతం, జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టు లపై ఆయనతో చర్చించారు. జిల్లా ప్రజల రవాణా అవ సరాల దృష్ట్యా శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదు గా సికింద్రాబాద్‌కు, అలాగే తిరుపతికి నూతన రైలు సర్వీసులను ప్రారంభించాలని కోరారు. జిల్లా కనెక్టివిటీ ని పెంచేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయన్నారు.
లాజిస్టిక్స్ హబ్‌గా హరిశ్చంద్రపురం
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌ను అన్నివిధాలా ఉపయోగ పడేలా ‘లాజి స్టిక్స్ హబ్’గా అప్‌గ్రేడ్ చేయాలని రామ్మోహన్ నాయు డు కోరారు. మందస రోడ్, పాత పట్నం, హరిశ్చంద్ర పురం స్టేషన్లలో ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాల న్నారు. కామేశ్వరిపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధితో పాటు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కొత్త ఆర్వోబీలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు.
కొత్తవలస-పలాస ఆపరేషన్ల పరిశీలన
భేటీ అనంతరం ఇరువురు మంత్రులు రైల్వే ఆపరే షన్స్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కొత్తవలస-పలాస సెక్షన్ల మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణ, ప్రస్తుత ఆపరేషన్స్ వివరాలను రామ్మోహన్‌కు రైల్వేమంత్రి వివరిం చారు. విశాఖ రైల్వే జోన్ పనుల ప్రస్తుత పురోగతిని తెలియజేశారు.
ఎయిర్-రైల్ కనెక్టివిటీపై ఫోకస్
ప్రధాని మోదీ నేతృత్వంలో ‘వికసిత్ భారత్’ లక్ష్యాల కు అనుగుణంగా విమానయాన, రైల్వే రవాణా వ్యవస్థల అనుసంధానంపై మంత్రులు కీలకంగా చర్చించారు. గుజరాత్‌లో కొత్తగా నిర్మిస్తున్న ‘దొలేరా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్’కు రైల్వే లాజిస్టిక్స్ రవాణాను అనుసంధానంపై చర్చించారు. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న ప్రాజెక్టుల్లో ఈ తరహా మల్టీ-మోడల్ లాజిస్టిక్ కనెక్టి విటీకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సమా వేశంలో రెండు శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.