ఫిట్‌నెస్‌పై దృష్టి
ABN , Publish Date - May 29 , 2026 | 12:06 AM
Inspection of educational institution buses జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 1 నుంచి అధికారులు ఐదు బృందాలుగా బస్సుల సామర్థ్యం తనిఖీ చేస్తున్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంలో తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారు.
విద్యాసంస్థల బస్సుల తనిఖీ
ఆటోమేటిక్ టెస్టింగ్ విధానం ద్వారా పరిశీలన
నిబంధనలు పాటించని వారికి నోటీసులు
ఇచ్ఛాపురం, మే 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 1 నుంచి అధికారులు ఐదు బృందాలుగా బస్సుల సామర్థ్యం తనిఖీ చేస్తున్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంలో తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారు. రోడ్డు భద్రత, వాహనాల ఫిట్‌నెస్, అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, డ్రైవర్ లైసెన్స్ చెల్లుబాటు, పర్మిట్లు వంటివి పరిశీలిస్తున్నారు. చాలా బస్సుల్లో లోటుపాట్లు బయటపడుతున్నాయి. జిల్లాలో 614 బస్సులు ఉండగా.. ఈ నెల 18 నాటికి 291 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 66 మంది యాజమానులకు నోటీసులు అందజేశారు.
జిల్లాలో మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రాగోలు జెమ్స్‌లోని మెడికల్, నర్సింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు 398, ప్రైవేటు జూనియర్ కాలేజీలు 71, డిగ్రీ కాలేజీలు 85 ఉన్నాయి. వీటి పరిధిలో 614 బస్సులు నడుస్తున్నాయి. వీటికి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో సామర్ధ్య పరీక్షలు తప్పనిసరి. కొన్నేళ్లుగా స్కూల్ బస్సుల సామర్ధ్య పరీక్షలు అస్తవ్యస్తంగా సాగినట్టు విమర్శలు ఉన్నాయి. అందుకే ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మానవ తప్పిదాలకు, అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. యంత్రాల సాయంతో సామర్థ్యాన్ని తనిఖీ చేస్తారు. వాహనం నుంచి వెలువడుతున్న పొగ, బ్రేక్, లైట్ల పనితీరును పరిశీలిస్తారు. అందులో ఏ చిన్నలోపం ఉన్నా ధ్రువీకరణపత్రం రాదు. కండిషనల్‌లో ఉన్న వాహనాలకే ధ్రువపత్రం అందుతుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
తరచూ ప్రమాదాలు..
గత ఏడాది స్కూల్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఏకంగా చెరువులు, కాలువల్లోకి బస్సులు దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ మరణాలు సంభవించలేదు. అయితే ప్రమాదాలకు బస్సులు కండిషన్ లేకపోవడం ఒక ఎత్తయితే.. అరకొరగా శిక్షణ పొందిన డ్రైవర్లు కూడా మరో కారణం. శిక్షణ పొందిన ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్లనే ఎంపిక చేయాలి. ముందుగా వారి నుంచి ఫిట్‌నెస్ పొందాలి. కంటిచూపు సక్రమంగా ఉండడంతోపాటు మూర్చ వంటి వ్యాధులు లేని వారిని ఎంపిక చేసుకోవాలి. అయితే నిష్ణాతులైన డ్రైవర్లకు అధిక వేతనం ఇవ్వాల్సి వస్తోందని కొన్ని యాజమాన్యాలు వయసు పైబడిన వారికి సైతం డ్రైవర్లుగా ఎంపిక చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బస్సు డ్రైవర్‌కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు నాలుగేళ్లు అనుభవం ఉండాలి. కానీ కొందరు లైట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి సైతం బస్సుడ్రైవర్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
నిబంధనలు ఇవీ..
సురక్షితమైన, కండీషన్‌లో ఉన్న బస్సులనే వినియోగించాలి. 15ఏళ్లు దాటిన బస్సులను వినియోగించకూడదు. కానీ కొన్ని పాఠశాలలు పాత బస్సులకు రంగులు వేసి నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాలి. పిట్‌నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేయాలి. బస్సు ముందు, వెనుక భాగాల్లో స్కూల్ బస్సు, ఆన్ స్కూల్ డ్యూటీ అని రాయాలి. బస్సులో ఫస్ట్‌ఎయిడ్ బాక్సు, ఎమర్జెన్సీ డోర్ ఏర్పాటు చేయాలి. అగ్నిప్రమాద నివారణ పరికాలు అందుబాటులో ఉంచాలి. కిటికీలకు నెట్ తప్పనిసరిగా ఉంచాలి. బస్సు తలుపులకు లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. బస్సులో పిల్లల కోసం సహాయకులను నియమించాలి. గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించకుండా స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటుచేయాలి. కానీ గత కొన్నేళ్లుగా ఈ నిబంధనలేవీ అమలైన దాఖలాలు లేవు. ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంతోనైనా వాటికి చెక్ పడుతుందా? లేదా? అన్నది చూడాలి.
యాజమాన్యాలదే బాధ్యత
బస్సులు, డ్రైవర్ల విషయంలో పాఠశాల యాజమాన్యాలే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కండీషన్‌లో ఉన్న బస్సులను ఏర్పాటు చేసుకోవాలి. జూన్ 12న పాఠశాలలు తెరిచే సమయానికి ఫిటనెస్ పత్రాలు పొంది ఉండాలి. లేదంటే చర్యలు తప్పవు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.
- విజయసారధి, డీటీసీ, శ్రీకాకుళం