చదువుపై దృష్టి సారించాలి: కలెక్టర్
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:35 PM
పదో తరగతి పరీక్షలు దగ్గరవుతుండడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కో రారు.
టెక్కలి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు దగ్గరవుతుండడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కో రారు. లక్ష్యం చిన్నదైనా గురి పెద్దదిగా ఉండాలని తెలిపారు. సోమవారం టెక్కలి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి ఎడ్యుకేషనల్ ఎపిపని మెరిట్‌టెస్ట్- 2026లో ప్రథమ ర్యాంక్ సాధించిన సీతాపురం జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థి సకలాభక్తుల భరత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా గణితం, సైన్స్, జనరల్ నాలెడ్జ్ విభాగంలో ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న ఏడు, పదోతరగతి విద్యా ర్థులను ప్రోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిపని స్వచ్ఛందసంస్థ ఆన్‌లైన్‌మెరిట్ పరీక్ష నిర్వహించిందని, మొదటి ర్యాంకు సాధించిన భరత్‌కు రూ.30వేల ప్రోత్సా హం, కప్ అందించారని హెచ్‌ఎం తమ్మినాన పద్మావతి, గైడ్‌గా వ్యవహరించిన బి.చిన్నారావులు తెలిపారు. వీరితో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఉన్నారు.
జిల్లా కేంద్రాసుపత్రి సిబ్బంది తీరుపై ఫిర్యాదుల వెల్లువ
టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. టెక్కలి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కేంద్రాసుపత్రికి వచ్చిన కేసులకు సంబంధించి సేవలు అందిం చకుండా సిబ్బంది ఎక్కువగా రిఫర్ చేస్తున్నారని బీజేపీ మండలాధ్యక్షుడు జర్జాన రామ్‌జీ, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రోగులకు అవసరమైన ట్రీట్ మెంట్ జరగడం లేదని కోటబొమ్మాళి మండలంలోని జర్జంగికి చెందిన జీరు యర్రయ్య, జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై నందిగాం మండలంలోని కొత్తగ్రహరం గ్రామానికి చెందిన మొగిలిపేట జగ్గారావు అర్జీని అందజేశారు. విజిలెన్స్ మోనటరింగ్ సమావేశాలు నెలల తరబడి జరగడం లేదని దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ బెలమర ప్రభాకర్, జగతిమెట్ట జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేవని రాజకుమార్‌రెడ్డి అర్జీని అందజేశారు. తాను నిరుపేద దివ్యాంగురాలినని, తనకు కారు ఉందని ఫింఛన్ రద్దు చేయడంతో పునరుద్ధరించాలని టెక్కలికి చెందిన గొంటి వెంకటరత్నం కోరారు.