వరద తగ్గుముఖం
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:39 AM
Bahuda river.. Now Calmed తుఫాను ప్రభావంతో వరద ముంపులో చిక్కుకున్న ఇచ్ఛాపురం ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంది. బాహుదా నదితోపాటు బీమ సముద్రం, పద్మాపురం గెడ్డల్లో వరద ఉధృతి తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలు పునఃప్రారంభం కాగా, ముంపు గ్రామాలకూ రాకపోకలు మొదలయ్యాయి.
సాధారణ స్థితికి ఇచ్ఛాపురం.. శాంతించిన బాహుదా
బీమ సముద్రం, పద్మాపురం గెడ్డల్లో తగ్గిన ప్రవాహం
జాతీయ రహదారిపై వాహన రాకపోకల పునరుద్ధరణ
ముంపు గ్రామాలన్నింటికీ మొదలైన రాకపోకలు
ఇచ్ఛాపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావంతో వరద ముంపులో చిక్కుకున్న ఇచ్ఛాపురం ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంది. బాహుదా నదితోపాటు బీమ సముద్రం, పద్మాపురం గెడ్డల్లో వరద ఉధృతి తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలు పునఃప్రారంభం కాగా, ముంపు గ్రామాలకూ రాకపోకలు మొదలయ్యాయి. ఆర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు ఇచ్ఛాపురం ప్రాంతం అతలాకుతలమైంది. బాహుదా నదిలోకి రికార్డు స్థాయిలో సుమారు 80వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహుదా నదితోపాటు బీమ సముద్రం, పద్మాపురం గెడ్డలు ఒకేసారి పొంగడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం నుంచి పలాస, ఒడిశా వైపు వెళ్లే వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బాహుదా నదిలో వరద ఉధృతికి రైల్వే వంతెనను తాకుతూ నీరు ప్రవహించింది. జాడుపూడి రైల్వే స్టేషన్ కూడా వరద నీటితో మునిగిపోయింది. ఇచ్ఛాపురం మండలంలోని తులసిగాం, ధర్మపురం, ఇన్నేసుపేట, లొద్దపుట్టి, జగన్నాథపురం, శాసనం, అరకభద్ర, టి.బరంపురం తదితర 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రత్తకన్న, మశాఖపురం, బి.తోటూరు, తేలుకుంచి, కొళిగాం, పాయితారి, కిర్తిపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తగ్గుముఖం పట్టిన వరద
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. బాహుదా నదిలో నీటి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు తగ్గడంతోపాటు వర్షం కూడా తగ్గింది. మధ్యాహ్నానికి వరద ఉధృతి సగానికి పైగా తగ్గగా, సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీంతో ముంపు ప్రాంతాల్లో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. బెల్లుపడ జాతీయ రహదారి పాత టోల్‌గేట్ సమీపంలో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేకపోయారు. ఉదయం 11 గంటల వరకు రహదారిపై నీటి ప్రవాహం తగ్గకపోవడంతో వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నానికి ప్రవాహం తగ్గడంతో డీఎస్పీ ఎస్‌వీ రమణ అక్కడ ఉండి ఒక్కో వాహనాన్ని పంపించారు. రహదారికి ఇరువైపులా డివైడర్‌కు గండి కొట్టడంతో వరద నీరు దిగువకు వెళ్లి ప్రవాహం తగ్గింది. సాయంత్రానికి ట్రాఫిక్ పూర్తిగా క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
వరద బాధితులకు తక్షణ సాయం అందించాలి
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు తక్షణ సాయం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచి అండగా నిలవాలని సూచించారు. శుక్రవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించిన కలెక్టర్.. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. దండు గెడ్డ వద్ద వరద ప్రవాహాన్ని, నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇన్నేసుపేట పరిసర ప్రాంతాలతో పాటు బాహుదా నది, బెల్లుపడ వరద గట్టు వద్ద నీటి ప్రవాహాన్ని సమీక్షించారు. వరదలతో ప్రభావితమైన గ్రామాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సంఖ్య, వారికి అవసరమైన సహాయక చర్యలపై ఆరా తీశారు. నదీ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించడంలో నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు.