వరద కాలువ కబ్జా
ABN , Publish Date - May 25 , 2026 | 12:07 AM
Illegal gravel filling in the layout పట్టణంలోని పురుషోత్తమ సాగరానికి(ఎర్రచెరువు) సంబంధించిన వరద కాలువ(ఎర్ర కాలువ) కబ్జాకు గురైంది. ఈ కాలువను ఆక్రమణదారులు పూర్తిగా మట్టితో కప్పేశారు. దీంతో కాలువ పూర్తిగా కనుమరుగైంది.
పూర్తిగా కప్పేసిన ఆక్రమణదారులు
లేఅవుట్‌లో అక్రమంగా కంకర ఫిల్లింగ్
పట్టించుకోని అధికారులు
పలాస, మే 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పురుషోత్తమ సాగరానికి(ఎర్రచెరువు) సంబంధించిన వరద కాలువ(ఎర్ర కాలువ) కబ్జాకు గురైంది. ఈ కాలువను ఆక్రమణదారులు పూర్తిగా మట్టితో కప్పేశారు. దీంతో కాలువ పూర్తిగా కనుమరుగైంది. కేవలం గూగుల్, సర్వే మ్యాప్‌ల్లోనే అది కనిపిస్తోంది. ఆక్రమణలను నియంత్రించాల్సిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సర్వేనెంబర్లు 25, 43, 44, 45, 46లో ఉన్న నెమలికొండ-సూదికొండ పైనుంచి ప్రవహించే నీరు ఎర్రకాలువ ద్వారా పురుషోత్తమ సాగరానికి చేరుతుంది. మొత్తం ఒక కిలో మీటరు పొడవైన ఈ కాలువ గతంలో 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం ఆక్రమణల కారణంగా కాలువ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా శివాజీనగర్-సూదికొండ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలో కాలువకు ఆనించి ఉన్న జిరాయితీ స్థలాన్ని సంబంధిత యజమానులు విక్రయించారు. దీంతో ఈ స్థలంతో పాటు కాలువను కూడా మట్టితో కప్పేసి రియల్ ఎస్టేట్‌గా మార్చేశారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భూతద్దంలో వెతికినా కాలువ కనిపించడం లేదు. ఈ స్థలాన్ని మట్టితో కప్పేందుకు భారీ ట్రిప్పర్లు, ట్రాక్టర్లను వినియోగించారు. రాత్రుళ్లు మట్టి, కంకరను తరలించి చదును చేశారు. కంకరను కేవలం పునాదుల్లో వేసుకోవడానికి అధికారులు సూచనప్రాయంగా అనుమతులు ఇస్తే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం భారీ స్థాయిలో కంకర తవ్వుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. కాగా, ఈ వెంచర్‌కు మున్సిపల్ పరంగా ఎటువంటి అనుమతులు ఇంకా ఇవ్వలేదు. అయినా, ఆ ప్రాంతమంతా కాలువతో సహా కప్పి వెంచరు వేయడం విశేషం. దీనిపై ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే కబ్జాకు గురవుతున్న ప్రాంతాలను వారు సందర్శించి ఆక్రమణలు జరిగాయని నిర్ధారణ చేయడం తప్పా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి ఈ వ్యవహారంపై టౌన్‌ప్లానింగ్ అధికారి(ఇన్‌చార్జి) హర్షను వివరణ కోరగా ‘మాకు ఈ స్థలంపై ఫిర్యాదు వచ్చింది. కాలువ స్థలం ఎంత ఉందో చెప్పాలని రెవెన్యూ అధికారులను కోరాం. ప్రస్తుతం ఆ స్థలాన్ని చదును మాత్రమే చేశారు. వెంచరు వేస్తే మాత్రం అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వెళితే మాత్రం చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు. మండల సర్వేయర్ వై.గిరిని వివరణ కోరగా.. వీఆర్వోల నుంచి ఫిర్యాదు వస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని అన్నారు.