శవమై తేలి.. కన్నీరు మిగిల్చి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:17 AM
నదిలో గల్లంతైన ఆ రైతు ఎక్కడో ఒకచోట ఒడ్డుకు చేరుతాడని.. క్షేమంగా ఇంటికి చేరుతాడని కుటుంబ సభ్యులకు చిన్న ఆశ ఉండేది.
- బాహుదా నదిలో గల్లంతైన రైతు మృతి
- గ్రామస్థులు, పోలీసుల గాలింపు
- 24గంటల తరువాత మృతదేహం లభ్యం
ఇచ్ఛాపురం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నదిలో గల్లంతైన ఆ రైతు ఎక్కడో ఒకచోట ఒడ్డుకు చేరుతాడని.. క్షేమంగా ఇంటికి చేరుతాడని కుటుంబ సభ్యులకు చిన్న ఆశ ఉండేది. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆ రైతు ప్రాణాలు నదిలోనే కలిసిపోయాయి. 24 గంటల తరువాత శవమై తేలడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం ఉదయం బాహుదా నదిలో గల్లంతైన సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన గంగయ్య (50) అనే రైతు మృతి చెందాడు. గంగయ్యకు నది అవతల ఉన్న శాసనం పరిధిలో పొలం ఉంది. ఇటీవల వర్షాలు కురవడంతో దమ్ములు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పొలానికి వెళ్లేందుకు నది దాటుతున్న క్రమంలో గల్లంతయ్యాడు. సమీపంలో ఉన్న వారు గమనించేసరికి కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులతో పాటు పోలీసులు వెతకడం ప్రారంభించారు. మంగళవారం రాత్రి వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, ఆచూకీ కనపించలేదు. మరలా బుధవారం ఉదయం 6గంటల నుంచే వెతకడం ప్రారంభించారు. చివరికి ఉదయం 10గంటల సమయంలో శాసనాం బాహుదా నది గట్టు వద్ద ఆయన మృతదేహం లభ్యమయ్యిందని రూరల్ ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. గంగయ్యకు భార్య కాంతమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలకూ వివాహాలయ్యాయి. ఆయన మృతి చెందడంతో విలపిస్తున్నారు.