Share News

పొందూరులో ఐదు కేజీల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - May 29 , 2026 | 12:13 AM

పొందూరు రైల్వేస్టేషన్‌లో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరి మహిళల నుంచి పోలీసులు ఐదు కేజీ గంజాయి ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

 పొందూరులో ఐదు కేజీల గంజాయి స్వాధీనం
నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళల అరెస్టు

పొందూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): పొందూరు రైల్వేస్టేషన్‌లో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరి మహిళల నుంచి పోలీసులు ఐదు కేజీ గంజాయి ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ వి.సత్యనారాయణ పట్టుబడిన మహిళలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ అవతారం కథనం మేరకు.. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల నేపథ్యంలో పొందూరు ఎస్‌ఐకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో ఎస్‌ఐ వి.సత్యనారాయణ గురువారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో అనుమానంగా సంచరిస్తున్న మహారాష్ట్రకు చెందిన మంగళ దీపక జాదూ, మనోభై సంపత్తిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సామానులను పరిశీలించగా సుమారు ఐదు కేజీల గంజాయి బయటపడింది. మహిళలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు. పొట్టకూటికోసం ఇద్దరు మహిళలు ఒడిశాలోని ఛత్రపూర్‌లో రాజేష్‌ అనే వ్యక్తి వద్ద రూ.25 వేలకు ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం గంజాయితో మహారాష్ట్ర చేరుకునేందుకు శ్రీకాకుళంలో కోనార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి ఉంది. పొరపాటున శ్రీకాకుళానికి ఆనుకుని పొందూరులో రైలు దిగిపోయారు. సమాచారం రావడంతో పోలీసులకు ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. పొందూరు డీటీ రాధాకృష్ణ, వీఆర్వోల సమక్షంలో పట్టుబడ్డ మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గంజాయి పట్టుకున్న ఎస్‌ఐను సీఐ అవతారం అభినందించారు.

Updated Date - May 29 , 2026 | 12:13 AM