‘ఫిట్ ఇండియా’ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:36 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ను అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
- అధికారులందరూ సైకిళ్లపై రావాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- గ్రీవెన్స్‌కు సైకిళ్లపై వచ్చిన కలెక్టర్, జేసీ
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ను అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సైకిళ్లపై హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సైకిల్ తొక్కి ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మర్చిపోకూడదన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు అధికారులందరూ సైకిళ్లపై రావాలని కోరారు. నగర పరిధిలో అధికారులు రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కడం వలన చక్కని శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యం చేకూరుతుందని, అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు గమనించలేని ఎన్నో విషయాలను గమనించవచ్చని, మన చుట్టూ ఉన్న పరిసరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను కళ్లారా చూసే అవకాశం కలుగుతుందన్నారు. ఒకే మార్గంలో వివిధ శాఖల అధికారులు ప్రయాణించడం వలన పరస్పర సమన్వయం పెరుగుతుందని, అది పనులు వేగంగా జరిగేందుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సైకిళ్లపై గ్రీవెన్స్‌కు చేరుకున్న అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కాగా, కలెక్టర్ పిలుపునిచ్చినా సరే కొంతమంది అధికారులు మాత్రం కార్లు, మోటారు సైకిళ్లపై గ్రీవెన్స్‌కు హాజరుకావడం విశేషం.