Share News

అల.. మింగేసింది

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:06 AM

A boat capsizes in the sea రోజూమాదిరి సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఆ మత్స్యకారులకు అలల రూపంలో ప్రమాదం ఎదురైంది. అలల ఉధృతి కారణంగా వారు పయనిస్తున్న మరబోటు బోల్తాపడింది. దీంతో బోటులో ఉన్న ఐదుగురూ చెల్లాచెదురయ్యారు. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన నలుగురూ అతికష్టంపై తీరానికి చేరుకున్నారు. తోటి మత్స్యకారుడు మృతి చెందడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు.

అల.. మింగేసింది
గోపాలరావు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. ఇన్‌సెట్‌లో గోపాలరావు (ఫైల్‌)

సముద్రంలో మరబోటు బోల్తా

మత్స్యకారుడి మృతి

దేవునల్తాడ తీరంలో విషాదం

వజ్రపుకొత్తూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రోజూమాదిరి సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఆ మత్స్యకారులకు అలల రూపంలో ప్రమాదం ఎదురైంది. అలల ఉధృతి కారణంగా వారు పయనిస్తున్న మరబోటు బోల్తాపడింది. దీంతో బోటులో ఉన్న ఐదుగురూ చెల్లాచెదురయ్యారు. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన నలుగురూ అతికష్టంపై తీరానికి చేరుకున్నారు. తోటి మత్స్యకారుడు మృతి చెందడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన చెక్క గోపాలరావు(46).. సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో గోపాలరావుతోపాటు అదేగ్రామానికి చెందిన గాడి శ్రీనివాసరావు(బోటు యజమాని), తెరపల్లి లింగమయ్య, ఎరుపల్లి ఈశ్వరరావు, చింతల దానేసు చేపలవేటకు బోటులో బయలురేరారు. బోటు కొంతదూరం వెళ్లాక అలలు ఎగసిపడ్డాయి. ఆ ఉధృతికి బోటు బోల్తాపడగా.. అందులో ఉన్న ఐదుగురూ చెల్లాచెదురయ్యారు. చీకట్లో ఒకరికొకరు సాయంగా అతి కష్టంపై బోటును సరిచేశారు. కాగా ఆ సమయంలో గోపాలరావు ఆచూకీ కనపడకపోవడంతో వారంతా ఆందోళన చెందారు. గోపాలరావు కోసం గాలించగా.. తీవ్రగాయాలతో విగతజీవిగా కనిపించాడు. వారంతా తీవ్ర ఆవేదనతో ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. గోపాలరావు భార్య మహాలక్ష్మి, కుమారులు రాజు, చాణక్య, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామంటూ రోదించారు. మత్స్యకారులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ బి.నిహార్‌ పరిశీలించారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేపట్టి.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

మత్స్యకారుడి కుటుంబానికి రూ.10 లక్షలు: మంత్రి అచ్చెన్నాయుడు

మత్స్యకారుడు గోపాలరావు మృతి ఘటనపై మంత్రి కె. అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందిన గోపాలరావు కుటుంబానికి అండగా నిలిచేలా ప్రభుత్వం రూ.10లక్షల నష్ట పరిహారం ప్రకటించిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు, కార్మిక శాఖ నుంచి రూ.5లక్షలు మంజూరు చేశా మన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించడంతో మృతుడి కుటుం బానికి భరోసా దక్కిందన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై విస్తృతంగా అవగా హన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

Updated Date - Jan 07 , 2026 | 12:06 AM