Share News

అక్కడ మంటలు.. ఇక్కడ సెగలు!

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:40 PM

Concerns over prices due to Iran-Israel war కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మంటల సెగలు.. సిక్కోలును పరోక్షంగా తాకనున్నాయి. ఆ యుద్ధ ప్రభావం.. జిల్లాలో సామాన్య ప్రజలపై పడనుంది. ఉప్పు, పప్పు తదితర నిత్యావసర వస్తువులతోపాటు పొలంలో చల్లే ఎరువు బస్తా, ఇళ్ల నిర్మాణ సామగ్రి.. ఇలా ప్రతిదానిపైనా ధరల భారం పెరగనుంది.

అక్కడ మంటలు.. ఇక్కడ సెగలు!

ఇరాన్‌- ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో నిత్యావసరాల ధరలపై ఆందోళన

రవాణా చార్జీలు పెరిగితే సామాన్యులపై మరింత భారం

మత్స్యకారులు, గల్ఫ్‌ వలసజీవులపైనా తీవ్ర ప్రభావం

నిర్మాణ రంగానికి ఉక్కిరిబిక్కిరి.. రైతులకు ఎరువుల గుబులు

శ్రీకాకుళం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మంటల సెగలు.. సిక్కోలును పరోక్షంగా తాకనున్నాయి. ఆ యుద్ధ ప్రభావం.. జిల్లాలో సామాన్య ప్రజలపై పడనుంది. ఉప్పు, పప్పు తదితర నిత్యావసర వస్తువులతోపాటు పొలంలో చల్లే ఎరువు బస్తా, ఇళ్ల నిర్మాణ సామగ్రి.. ఇలా ప్రతిదానిపైనా ధరల భారం పెరగనుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న జిల్లావాసులపై ఈ మధ్యప్రాచ్య సంక్షోభం.. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారే ప్రమాదం పొంచి ఉంది. యుద్ధం మరింత ముదిరితే, జిల్లాలో ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

పెట్రోల్‌ మండితే.. అన్నీ పైపైకి!

జిల్లాలో ఏ వస్తువు కొనాలన్నా రవాణా కీలకం. విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి.. అక్కడ నుంచి పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస లాంటి నలుమూలలకు సరుకులు చేరాలంటే లారీలు, వ్యాన్లే దిక్కు. యుద్ధం వల్ల ముడిచమురు సరఫరాకు ఆటంకం ఏర్పడితే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు భగ్గుమంటాయి. పల్లెల నుంచి శ్రీకాకుళం రైతుబజార్లకు కూరగాయలు తెచ్చే ఆటోచార్జీలు మొదలుకొని, నిత్యావసర సరుకుల రవాణా వరకు అన్నీ ప్రియం కానున్నాయి. ఈ భారం నేరుగా వినియోగదారులపై పడుతుంది. పెట్రోల్‌ ధర ఇప్పటికే లీటరు రూ.110 ఉంది. ఈ ధర మరింత పెరగనుండడంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

వంటగదిలోనూ మంటలే...

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడితే, విదేశాల నుంచి వచ్చే వంటనూనెల (పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌) సరఫరాకు బ్రేకులు పడతాయి. ఇప్పటికే కిరాణా దుకాణాల్లో వంట నూనెల ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. 800 గ్రాముల నూనె ప్యాకెట్‌ రూ.140 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలకు మరింత రెక్కలొచ్చే ప్రమాదం ఉందని జిల్లా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పట్లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలను అమాంతం పెంచేశారు. వ్యాపారుల దోపిడీ తీవ్రమైంది. మళ్లీ వంట నూనె ధరలు పెరుగవచ్చని వ్యాపారులు భావించి.. దుకాణాల్లో అధికంగా నిల్వ చేస్తున్నారు.

రైతన్నకు ‘ఎరువుల’ గుబులు!

నాగావళి, వంశధార నదుల ఆధారంగా సాగు చేసే మన జిల్లా రైతులకు ఈ యుద్ధం మరో ఆశనిపాతం. మన దేశం ఎరువులను, ముఖ్యంగా పొటాష్‌(ఎంఓపీ)ను మధ్యప్రాచ్య దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఉద్రిక్తతల వల్ల ఎరువుల దిగుమతులు నిలిచిపోయినా, నౌకా రవాణా ఖర్చులు పెరిగినా.. ఆ భారం ఎరువుల బస్తాపై పడుతుంది. ఇది జిల్లాలోని వరి, ఇతర వాణిజ్య పంటలు పండించే రైతుల పెట్టుబడి వ్యయాన్ని విపరీతంగా పెంచేస్తుంది.

గంగపుత్రులకు కష్టకాలం..

జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం, బారువ తదితర తీరప్రాంతాల్లో వేలాది మత్స్యకార కుటుంబాలు సముద్రపు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. మోటారు బోట్ల (మెకనైజ్డ్‌ బోట్లు) ద్వారా వీరు వేటకు వెళ్తుంటారు. డీజిల్‌ ధరలు పెరిగితే, వేటకు వెళ్లే ఖర్చు తడిసి మోపెడవుతుంది. లభించే మత్స్య సంపద తగ్గితే నష్టాలు తప్పవని గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.

గల్ఫ్‌ వలసజీవుల కుటుంబాల్లో దడ!

జిల్లాలో ముఖ్యంగా ఉద్దానం ప్రాంతం నుంచి వందలాది మంది ఉపాధి కోసం దుబాయ్‌, కువైట్‌, ఒమన్‌ తదితర గల్ఫ్‌ (మధ్యప్రాచ్య) దేశాలకు వలస వెళ్లారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఇతర గల్ఫ్‌ దేశాలకు పాకితే, అక్కడ పనిచేస్తున్న మన వారి భద్రత, ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఇక్కడ వారిపై ఆధారపడిన కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

నిర్మాణ రంగానికి ఉక్కిరిబిక్కిరి..

సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే జిల్లా వాసులకు సైతం ఇదొక చేదువార్తే. రవాణా ఖర్చులు పెరగడంతోపాటు, అంతర్జాతీయ మార్కెట్‌ అస్థిరత కారణంగా స్టీల్‌, సిమెంట్‌, ఐరన్‌ ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో ఇసుక, కంకర రవాణా ఖర్చులు భారంగా మారగా, ఇప్పుడు మెటీరియల్‌ ధరలు పెరిగితే నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో పడుతుంది.

అధికారులు అప్రమత్తం కావాలి...

ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో సామాన్యుడి బతుకుబండి నడవాలంటే మరింత కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకుని జిల్లాలో నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టించే దళారులు, బ్లాక్‌ మార్కెటీర్లపై విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపాల్సి ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటేనే జిల్లాప్రజలకు కొంత ఊరట దక్కుతుంది.

Updated Date - Mar 06 , 2026 | 11:40 PM