Share News

నిప్పు.. ముప్పు

ABN , Publish Date - May 01 , 2026 | 12:47 AM

Fires in forest areas పర్యావరణ సమతుల్యం కాపాడుతున్న అడవుల్లో అగ్ని ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండిన ఆకులు, బోద, ఎండు గడ్డి, కంపచెట్లకు చిన్న నిప్పు అంటినా.. రాజుకుని ముప్పుతప్పడం లేదు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో పోడు వ్యవసాయంలో భాగంగా కొంతమంది రైతులు, పశువులు, గొర్రెల కాపరులు ఎండుగడ్డి, చెట్లు, రాలిన ఆకులకు నిప్పు పెడుతున్నారు.

నిప్పు.. ముప్పు
కేరాశింగి అడవుల్లో మంటలు

  • అటవీ ప్రాంతాల్లో తరచూ అగ్నిప్రమాదాలు

  • పోడు వ్యవసాయంలో భాగంగా మంట పెడుతున్న వైనం

  • నివారణకు అధికారుల చర్యలు

  • మెళియాపుట్టి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం కేరాశింగి, గూడ ప్రాంతంలోని కొండల్లో గతేడాది అగ్గి రాజుకుని ఆరు రోజులపాటు మంటలు అదుపుచేయలేని పరిస్థితి ఏర్పడింది. గిరిజనులు సాగు చేస్తున్న పోడు వ్యవసాయం మొక్కలు కాలి బూడిదై తీవ్ర నష్టం వాటిల్లింది. అడవిలో విలువైన మొక్కలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి.

  • టెక్కలి మండలం జి.జగన్నాఽథపురం గ్రామ సమీపంలోని కొండపై ఈ నెల 10న అగ్గి రాజుకుంది. గ్రామస్థులు చూసి.. వెంటనే రాలిన ఆకులను దూరం చేశారు. ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

  • పర్యావరణ సమతుల్యం కాపాడుతున్న అడవుల్లో అగ్ని ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండిన ఆకులు, బోద, ఎండు గడ్డి, కంపచెట్లకు చిన్న నిప్పు అంటినా.. రాజుకుని ముప్పుతప్పడం లేదు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో పోడు వ్యవసాయంలో భాగంగా కొంతమంది రైతులు, పశువులు, గొర్రెల కాపరులు ఎండుగడ్డి, చెట్లు, రాలిన ఆకులకు నిప్పు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ అగ్గి అటవీ ప్రాంతాలకు వ్యాపించి.. ప్రమాదాలకు దారితీస్తోంది. జిల్లాలో 1,15,892 ఎకరాల్లో ఆటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఏటా వేసవికాలంలో భారీగా వృక్ష, జంతు సంపద కాలి బూడిదవుతోంది. అటవీశాఖ అధికారులు.. స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా.. పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎస్‌) సహకారం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో అగ్నిప్రమాదాల నివారణపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

  • అవగాహన కల్పించినా..

  • అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టరాదని.. గిరిజన గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఎవరైనా నిప్పు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదవశాత్తు నిప్పు రాజుకుంటే మంటలు అదుపు చేయడంపై కూడా అవగాహన కల్పించారు. కాగా కొంతమంది గిరిజనులు కొత్తగా పోడు వ్యయసాయం చేసేందుకు అటవీ ప్రాంతాల్లో కలపను తొలగిస్తున్నారు. వాటికి నిప్పు పెడుతున్నారు. ఇటువంటి సమయాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గిరిజనులకు అవగాహన కల్పించినా ప్రయోజనం లేకపోతోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సాంకేతిక నైపుణ్యంతో కూడా అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్‌ల ద్వారా అగ్నిప్రమాద ప్రాంతాలను గుర్తించి.. ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు.

  • ప్రమాదాల నివారణకు చర్యలు

  • అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఎండలు అధికంగా ఉండడం వల్ల.. గిరిజనులు కూడా అటవీ ప్రాంతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కావాలనే అగ్గి పెడితే కేసులు నమోదు చేస్తాం.

    - ఝూన్సీ, అటవీశాఖ అధికారిణి, టెక్కలి

Updated Date - May 01 , 2026 | 12:47 AM