Share News

జీడి తోటకు నిప్పు

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:50 PM

ఏఎస్‌ కవిటి పంచాయతీ నల్లబొంతు రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని జీడి తోటకు గురువారం సాయంత్రం నిప్పంటుకుంది.

జీడి తోటకు నిప్పు
మాడిపోయిన జీడిపూతను పరిశీలిస్తున్న గిరిజనులు

- పాక్షికంగా దెబ్బతిన్న వెయ్యి చెట్లు

- మాడిపోయిన పూత, పిందెలు

- గగ్గోలుపెడుతున్న గిరిజనులు

పాతపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఏఎస్‌ కవిటి పంచాయతీ నల్లబొంతు రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని జీడి తోటకు గురువారం సాయంత్రం నిప్పంటుకుంది. దీంతో వందల చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పూత, పిందెలు మాడిపోవడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు. ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. నల్లబొంతు గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో జీడి తోట ఉంది. దీనికి సమీపంలోని పొలాల్లో ఉన్న చెత్తకు కొందరు రైతులు గురువారం సాయంత్రం నిప్పుపెట్టి ఇంటికి వచ్చేశారు. అయితే, గాలికి నిప్పులు ఎగిరి జీడి తోటలోని ఆకులకు అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగసిపడడంతో గిరిజనులు వెళ్లి అదుపు చేశారు. అయితే, అప్పటికే సుమారు 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుమారు వెయ్యి వరకు జీడిచెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్ని కీలలకు పూత, పిందెలు మాడిపోయాయి. దీంతో ఈ తోటపై ఆధారపడి బతుకుతున్న 20 గిరిజన కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. సర్పంచ్‌ మార్కండేయులు సమాచారం మేరకు వీఆర్వో కృష్ణవేణి శనివారం ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన చెట్లను పరిశీలించారు. నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:50 PM