Share News

ఎట్టకేలకు పట్టుబడ్డారు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:08 AM

Fake Rath Saptami passes busted అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న నకిలీ పాస్‌ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

ఎట్టకేలకు పట్టుబడ్డారు

రథసప్తమి నకిలీపాస్‌ల గుట్టురట్టు

ఆరుగురు అరెస్టు

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న నకిలీ పాస్‌ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాలను రాష్ట్రపండుగగా వారం రోజులపాటు ఘనంగా నిర్వహించారు. జనవరి 19 నుంచి 26 వరకు ఉత్సవాలు సాగాయి. జిల్లా అధికారుల నేతృత్వంలో శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జనవరి 24న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజికల్‌ షో నిర్వహించారు. ఈ షోకు వీఐపీ, వీవీఐపీ పాస్‌లను అధికారులు ముద్రించారు. కాగా వీవీఐపీ లాంచ్‌లో కేటాయించిన సీట్ల కన్నా.. మూడింతల పాస్‌లతో అనేకమంది మ్యూజిక్‌ షోకు తరలివచ్చారు. దీంతో అసలైన వీవీఐపీలు ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు వీఐపీ, వీవీఐపీ నకిలీ పాస్‌లు ముద్రించి ఉండవచ్చని పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు.

రథసప్తమి రోజు కూడా..

జనవరి 25న అర్ధరాత్రి నుంచి రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. సామాన్య భక్తులు, వీఐపీ, వీవీఐపీలకు ఇబ్బందులు లేకుండా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రూ.100, రూ.500తోపాటు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కాగా.. 26న వేకువజాము 4 గంటల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అరసవల్లిలోని అసిరితల్లి ఆలయం వద్ద ఒకానొక దశలో తోపులాట జరిగింది. వీఐపీ, వీవీఐపీ క్యూలైన్లలో భక్తుల తాకిడిని నిలువరించేందుకు పోలీసులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక్కడ కూడా నకిలీ పాస్‌లతో చాలామంది స్వామిని దర్శించుకున్నారనే ప్రచారం సాగింది. దీనిపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానం ముద్రించిన వీఐపీ, వీవీఐపీ పాస్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఎలా వచ్చారనే దానిపై దర్యాప్తు చేపట్టాలని టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులకు ఆదేశించారు. నగరంలోని పలు జిరాక్స్‌, ప్రింటింగ్‌ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి ముందుగా 12 మంది అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న మణికంఠ జిరాక్స్‌ అండ్‌ ప్రింటర్స్‌లో వీఐపీ, వీవీఐపీల నకిలీ పాస్‌లు ముద్రించారని నిర్ధారించారు. యజమానులు కొండలరావు, మణికంఠ, సంతోష్‌తోపాటు హరిప్రసాద్‌, శ్రీను, రాజు నకిలీ పాస్‌ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. ఆ ఆరుగురినీ శుక్రవారం అరెస్టు చేశామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ వెల్లడించారు.

Updated Date - Apr 18 , 2026 | 12:08 AM