Share News

‘పది’లో ఐదో స్థానం

ABN , Publish Date - May 01 , 2026 | 12:54 AM

Tenth results పదోతరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకు రాష్ట్రస్థాయిలో ఐదో స్థానం దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది కన్నా ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలురు కన్నా బాలికలే ముందంజలో నిలిచారు.

‘పది’లో ఐదో స్థానం
రణస్థలం : పైడిభీమవరం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని ఎస్‌.దేవీప్రియ(594)ను, తల్లిదండ్రులను అభినందిస్తున్న డీఈవో రవిబాబు

  • జిల్లాలో 90.60 శాతం ఉత్తీర్ణత

  • బాలికలదే పైచేయి..

  • శ్రీకాకుళం/ నరసన్నపేట/ గుజరాతీపేట, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి):

  • పదోతరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకు రాష్ట్రస్థాయిలో ఐదో స్థానం దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది కన్నా ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలురు కన్నా బాలికలే ముందంజలో నిలిచారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. గురువారం ఫలితాలు వెల్లడి కాగా.. 28,523 మంది విద్యార్థులకుగానూ 25,841 (90.60 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 21,927 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. 2,858 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణి, 1,056 మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు. జిల్లాలో మొత్తం 14,627 మంది బాలురు పరీక్షలు రాయగా.. 12,992 మంది (88.82శాతం) పాసయ్యారు. బాలికలు 13,896 మందికిగానూ (92.47శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. పైడిబీమవరం ఉన్నత పాఠశాలకు చెందిన సీరపు దేవీప్రియ 594 మార్కులతో ప్రథమస్థానం సాధించింది. ఆమదాలవలస మునిసిపల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన నౌపడ చిద్విలాస 593 మార్కులు, రణస్థలం మండలం కొండములగాం ఆదర్శ పాఠశాలకు చెందిన నాసిక రమ్యశ్రీ 593 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

  • 146 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు

  • ప్రైవేటుకు దీటుగా జిల్లాలోని పలు ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 563 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా, ఏకంగా 146 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 80 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు కాగా, 66 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు (జడ్పీ, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, తదితర) ఉండటం విశేషం. మరో 217 పాఠశాలలు 90 నుంచి 99 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి.

  • జిల్లాలో ఎల్‌ఎన్‌.పేట, లావేరు, మందస, మెళియాపుట్టి, నందిగాం, సారవకోట కేజీబీవీ పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. రణస్థలం ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాదించారు.

  • ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఏపీఆర్‌ఎస్‌) 99.34 శాతంతో అగ్రస్థానంలో నిలిచాయి.

  • మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) పాఠశాలలు 98.44 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

  • ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు 97.80 శాతంతో సత్తా చాటాయి.

  • ఏపీ మోడల్‌ స్కూల్స్‌ (ఏపీఎంఎస్‌) 96.57 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.

  • ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 88.07 శాతం (బాలురు 85.02 శాతం, బాలికలు 90.87 శాతం) ఉత్తీర్ణత సాధించాయి.

  • జిల్లా పరిషత్‌ పాఠశాలల నుంచి 13,477 మంది విద్యార్థులు హాజరుకాగా 11,840 (87.85శాతం) మంది పాసయ్యారు. 285 జడ్పీ స్కూల్స్‌ లో 44 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

  • 14వ స్థానం నుంచి..

  • గతేడాది పదో తరగతి ఫలితాలతో పోల్చితే ఈసారి జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపారు. గతేడాది 28,176 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23,219 మంది(82.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాకు రాష్ట్రస్థాయిలో 14వ స్థానం దక్కింది. ఈ ఏడాది మాత్రం 90.60శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంలో నిలవడం అభినందనీయం. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. 100 రోజులు ప్రణాళిక అమలు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత గతేడాదితో పోల్చితే 5 శాతం పెరిగింది.

  • 25 నుంచి అడ్వాన్‌ సప్లమెంటరీ

  • పదో తరగతిలో ఉత్తీర్ణతకాని విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 4 వరకు నిర్వహిస్తామని డీఈవో రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 9వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసం రూ.50తో మే నెల 25వరకు గడువు ఉందని తెలిపారు. ‘పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఎటువంటి సందేహాలున్నా.. రీ- కౌంటింగ్‌ లేదా రీ- వెరిఫికేషన్‌ ఫీజు చెల్లించేందుకు మే 7లోగా పాఠశాల లాగిన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రీ-కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. రీ - వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. సి.ఎఫ్‌.ఎం.ఎస్‌ ద్వారా సిటిజన్‌ చలానా కట్టరాదని, వీటిని తల్లిదండ్రులు గమనించాల’ని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

  • ప్రభుత్వ పాఠశాలల టాపర్లు వీరే...

  • -------------------------------------------------

  • విద్యార్థుల పేరు మార్కులు పాఠశాల

  • -----------------------------------------------

  • సీరపు దేవీ ప్రియ 594 జడ్పీ హైస్కూల్‌, పైడిభీమవరం

  • నౌపడ చిద్విలాస్‌ 593 మున్సిపల్‌ హైస్కూల్‌, మెట్టక్కివలస

  • నాసిక రమ్యశ్రీ 593 ఏపీ మోడల్‌ స్కూల్‌, కొండములగాం

  • బాలక కాత్యాయిని వరప్రసన్న 591 ప్రభుత్వ హైస్కూల్‌, కవిటి

  • కలిగట్ల దీపిక 591 ఏపీ మోడల్‌ స్కూల్‌, తామాడ

  • పూజారి కీర్తి పాండా 591 జడ్పీ హైస్కూల్‌, కాశీబుగ్గ

  • బైనపల్లి షర్మిల 591 ఎంజేపీఏపీబీసీడబ్ల్యుఆర్‌ స్కూల్‌, పలాస

  • శివ హరీష్‌ అంజంగి 591 ఎంజేపీఏపీబీసీడబ్ల్యుఆర్‌ స్కూల్‌, సంతబొమ్మాళి

  • పినపత్రుని సత్య ఇందు 591 మున్సిపల్‌ హైస్కూల్‌, అరసవల్లి

  • బగాది మౌనిక 591 జడ్పీ హైస్కూల్‌, లింగాలవలస

Updated Date - May 01 , 2026 | 12:54 AM