నీరు తెచ్చి.. నారుకు పోసి!
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:40 PM
Withered paddy nurseries వర్షాకాలంలోనూ.. వేసవిని తలపించేలా అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. ఈ ఏడాది ఖరీప్ సీజన్ ప్రారంభం నుంచే చినుకు జాడలేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాను వెంటాడుతున్న వర్షాభావం
ఎండిపోతున్న వరి నారుమళ్లు, ఎదలు
నీడితడులు అందించేందుకు రైతుల పాట్లు
ఎల్.ఎన్.పేట/ టెక్కలి రూరల్/ కోటబొమ్మాళి, జూలై 13(ఆంధ్రజ్యోతి):
టెక్కలి మండలం కొల్లివలసలో వరినారు మళ్లు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలో ఉన్న బోరువద్ద నీటిని బిందెలు, బకెట్లతో తెచ్చి వరినారును తడుపుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వరినారును కాపాడేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఎల్.ఎన్.పేట మండలం పెద్దకోటలో వరి ఎదలతోపాటు నారుమళ్లు మొక్కదశలో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటికుంటల నుంచి ఇంజన్లతో పైపుల ద్వారా వరినారుమళ్లుకు నీటిని అందిస్తున్నారు.
కోటబొమ్మాళి మండలం ఊడికలపాడులో వర్షాలు లేక.. సాగునీరు అందక వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయి. కూరగాయల సాగుదీ అదే పరిస్థితి. వరహాలమ్మపేటలో చిక్కుడు పంట, తదితర కూరగాయల మొక్కలు ఎండిపోతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
వర్షాకాలంలోనూ.. వేసవిని తలపించేలా అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. ఈ ఏడాది ఖరీప్ సీజన్ ప్రారంభం నుంచే చినుకు జాడలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికి జిల్లాలో చాలా చోట్ల వరినారు, ఎదలు వేశారు. కాగా.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో కలవరపడుతున్నారు. మరోవైపు గత నాలుగు రోజుల నుంచి ఎండల తీవ్రత కారణంగా వరినారు, ఎదలు ఎండిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. సమీపంలో బోర్లు, నీటికుంటలు ద్వారా నీటిని తెచ్చి.. తడుపుతున్నారు. వరుణ దేవుడి కరుణకోసం ఎదురుచూస్తున్నారు.
ఏటా జూలై నాటికి చెరువులు నీటితో కళకళలాడేవి. ఈ ఏడాది చెరువుల్లో కూడా నీరులేదు. కొన్ని ప్రాంతాలకు వంశధార కాలువ ద్వారా నీరు అందిస్తున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఉన్నా.. చెరువులు నింపే పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా సాగునీటి కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు.
ఎల్.ఎన్‌పేట మండలంలో వంశధార కుడిప్రధాన కాలువ దిగువున ఉన్న పొలాలకు కూడా నీరులేక బీటలువారుతున్నాయి. పెద్దకోట, బసవరాజుపేట, ధనుకువాడ, కోవిలాం, శ్యామలాపురం, కరకవలస, కుసుములపాడు, తురకపేట, చిట్టిమండలం, దబ్బపాడు మొదలైన గ్రామాల్లో వరినాట్లు ఎండిపోతున్నాయి. వంశధార నది కుడిప్రధాన కాలువకు ఎగువున ఉన్న కొమ్మువలస, గొట్టిపల్లి, కొత్తపేట, రావిచెంద్రి, పూశాం, చొర్లంగి, జాడుపేట, డొంకలబడవంజ, కవిటి జంబాడ మొదలైన గ్రామాల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వంశధార కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడిచిపెట్టినా.. మరో పది రోజుల వరకూ అనుసంధానంగా ఉన్న పిల్లకాలువలకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
ఎండుతున్న మొక్కలు
కోటబొమ్మళి మండలంలో మెట్టప్రాంతం అధికం. చీపుర్లపాడు, వరహాలమ్మపేట, ఊడికలపాడు, కన్నేవలస, పొన్నానపేట, రేగుల పాడు, దంత, కురుడు, రామేశ్వరం, చుట్టుగుండం తదితర గ్రామాల రైతులు వర్షాలపై ఆధారపడి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ నెలలో కురిసిన వర్షాలకు వేరుశనగ, కంది, జొన్న, కూరగాయల సాగుకు సిద్ధమయ్యారు. కాగా వర్షాలు లేక.. మరోవైపు ఎండలు మండుతుండడంతో.. మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు జూన్‌లో పచ్చిరొట్ట విత్తనాలిచ్చారు. జూలైలో కేంద్ర ప్రభుత్వ పుప్పుదాన్యాల పథకం కింద కొంతమంది రైతులకు కంది విత్తనాలు ఉచితంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి కొంతమందికి రాయితీపై మంజూరు చేశారు. కాగా.. వర్షం కురవకపోవడంతో ఇంతవరకు వాటిని విత్తుకునే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.