గోడ కూలి మహిళా కార్మికురాలి మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:29 AM
Death of a female worker మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పక్క ఇంటి మట్టిగోడ కూలి మీద పడి ఒక మహిళా కార్మికురాలు మృతిచెందగా, మరో కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి.
- మరొకరికి తీవ్ర గాయాలు
- మందస మండలం బేతాళపురంలో ఘటన
హరిపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పక్క ఇంటి మట్టిగోడ కూలి మీద పడి ఒక మహిళా కార్మికురాలు మృతిచెందగా, మరో కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బేతాళపురానికి చెందిన బచ్చల కాంతమ్మ, కీలు కనకదుర్గ భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో ఒక ఇంటి నిర్మాణం చేస్తుండగా... పక్కన ఉన్న మరో ఇంటి మట్టి గోడ కూలి సిమెంటు అందిస్తున్న మహిళా కార్మికులపై పడింది. దీంతో బచ్చల కాంతమ్మ(32) మట్టిపెల్లల శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందింది. కనకదుర్గ(33) తీవ్ర గాయపడగా స్థానికులు ఆమెను హరిపురం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటనా స్థలాన్ని మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పరిశీలించారు. కాంతమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.