టిక్కెట్ అడిగినందుకు.. మహిళా టీసీపై దాడి
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:34 AM
Attack on female TC టిక్కెట్ అడిగిన పాపానికి మహిళా టిక్కెట్ కలెక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు, ఆటో కార్మికులు ఆయన్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పలాస రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పలాస రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడి ఘాతుకం
అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు
పలాస, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): టిక్కెట్ అడిగిన పాపానికి మహిళా టిక్కెట్ కలెక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు, ఆటో కార్మికులు ఆయన్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పలాస రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్‌లో బ్రిడ్జికి దిగువన టీసీలు అక్కుదలై సుజాత, మాధవీలత.. ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తున్నారు. 6.30 గంటల సమయంలో ఓ వ్యక్తి టిక్కెట్ చూపించకుండా వెళ్లిపోతున్న విషయాన్ని టీసీ సుజాత గుర్తించారు. ఆ వ్యక్తిని ఆపి టిక్కెట్ అడగ్గా.. టీసీ సుజాత చెంపపై కొట్టాడు. ఆపై పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. టీసీ కేకలు వేయడంతో ప్రయాణికులు, సమీపంలో ఉన్న ఆటో కార్మికులు ఆయనను పట్టుకున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి ఒడిశా రాష్ట్రం బ్రహ్మపూర్‌కు చెందిన మొబైల్ టెక్నీషియన్ డి.ప్రసాదరావుగా పోలీసులు గుర్తించారు. టిక్కెట్ లేని ప్రయాణం చేసినందుకు రూ.600 అపరాధ రుసుం విధించారు. రైల్వేపోలీసుస్టేషన్‌కు ఆయనను తరలించి విచారణ చేస్తున్నారు. కాగా.. మహిళా టీసీపై ప్రయాణికుడు దాడి చేయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కరువవుతోందని ఆరోపిస్తున్నారు. టీసీ సుజాతపై దాడి జరిగిన సమయంలో ఆర్పీఎఫ్ అధికారులు సకాలంలో స్పందించలేదని పలువురు విమర్శిస్తున్నారు. విశాఖపట్నం కమర్షియల్‌ట్యాక్స్ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేసిన తరువాత వారు అక్కడ నుంచి మోనటరింగ్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందిని పంపించారని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.