వైసీపీలో ఓటమి భయం!
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:43 AM
A sense of discouragement even before the polling స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల్లో కనిపిస్తున్న ఉత్సాహం వైసీపీలో కొరవడింది. కూటమి పార్టీల్లోకి వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల చేరికలు పెరుగుతుండగా.. వైసీపీ ముఖ్య నాయకులు ఓటమి భయంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి నుంచే విశాఖ ఓటర్లకు పిలుపునివ్వడం.. శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రచార బాధ్యతలను గుండ లక్ష్మీదేవికి అప్పగించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
పోలింగ్‌కు ముందే ముఖ్య నాయకుల హ్యాండ్సప్
కూటమిలో చేరికల జోరు.. ఎమ్మెల్యేల విస్తృత ప్రచారం
ఇంటి నుంచే విశాఖ ఓటర్లకు మాజీ మంత్రి ధర్మాన పిలుపు
శ్రీకాకుళం, గారలో ప్రచార బాధ్యతలు గుండ లక్ష్మీదేవికి..
శ్రీకాకుళం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల్లో కనిపిస్తున్న ఉత్సాహం వైసీపీలో కొరవడింది. కూటమి పార్టీల్లోకి వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల చేరికలు పెరుగుతుండగా.. వైసీపీ ముఖ్య నాయకులు ఓటమి భయంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి నుంచే విశాఖ ఓటర్లకు పిలుపునివ్వడం.. శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రచార బాధ్యతలను గుండ లక్ష్మీదేవికి అప్పగించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. దీనికితోడు నాలుగు రోజులుగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు, ఈదురుగాలులు, విద్యుత్ అంతరాయాలు ఎన్నికల ప్రచారానికి ఆటంకంగా మారాయి. దీంతో జిల్లాలో రాజకీయ సందడి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ రాజకీయ ప్రభావం తగ్గింది. గత నెలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో వారి రాజకీయ ప్రాబల్యమూ క్రమంగా తగ్గింది. ప్రస్తుతం ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలతోపాటు 30 జడ్పీటీసీ, 523 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రచారం శుక్రవారం ముగియగా.. పరిషత్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అయితే వర్షాలు, ఈదురుగాలుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణాలు మినహా మండలాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఎన్నికల వాతావరణం పెద్దగా కనిపించడం లేదు.
కూటమిలో చేరికల జోరు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఆశిస్తూ కూటమి పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో కూటమిలో రెబెల్స్ బెడద ఏర్పడుతుందని, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవచ్చని వైసీపీ నాయకులు భావించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ సమయానికి వివాదాలు సద్దుమణిగాయి. పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు వ్యవహరించారు. బీఫారాలు పొందిన అభ్యర్థులే బరిలో ఉండగా.. మిగిలినవారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో జనసేన ఆరు, బీజేపీ రెండు, టీడీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆయా మండలాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. తుఫాన్ కారణంగా కొద్దిరోజులు ప్రచారానికి విరామం ఏర్పడినా.. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు టీడీపీలో చేరుతుండటం కూటమికి కలిసివస్తోంది. ఈ తరహా రాజకీయ చురుకుదనం వైసీపీలో కనిపించడం లేదు. ఎన్నికలను భుజాన వేసుకుని నడిపించే నాయకుడు జిల్లావ్యాప్తంగా ఆ పార్టీలో కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ప్రజలు స్థానిక ఎన్నికల్లోనూ అదే వైఖరి కొనసాగిస్తారేమోనన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.
విశాఖ ఓటర్లకు ఇంటి నుంచే పిలుపు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఓటర్లు వైసీపీకే ఓటు వేయాలని ఆయన శ్రీకాకుళంలోని తన నివాసం నుంచే మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. జిల్లాలోనూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆయన చురుగ్గా పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకట్రెండు సమావేశాల్లో పాల్గొని ధర్మాన, గుండ కుటుంబాలు కలిస్తే మిగిలిన వారినీ కలుపుకుని ముందుకు వెళ్తామంటూ వ్యాఖ్యలు చేసి సరిపెట్టారు. ధర్మాన వైసీపీలో చేరకముందు నుంచే వరుదు కల్యాణి ఆ పార్టీలో ఉన్నారు. ఆమె శ్రీకాకుళం అసెంబ్లీ, ఎంపీ స్థానాలను ఆశించినప్పటికీ ధర్మాన చేరికతో జిల్లాలో రాజకీయంగా ఆశించిన ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం ఆమె విశాఖలో ఉంటున్నారు. జగన్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాన శ్రీకాకుళం నుంచే విశాఖ ఓటర్లకు పిలుపునివ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ విశాఖ ఓటర్లను ఉద్దేశించి ప్రకటనలు చేయడం ఎంతవరకు ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
లక్ష్మీదేవికి ప్రచార పగ్గాలు
మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇటీవల వైసీపీలో చేరారు. ఆమెను పార్టీలోకి తీసుకురావడంలో ధర్మాన ప్రసాదరావు కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం, గార మండలాల్లో వైసీపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను లక్ష్మీదేవికి అప్పగించారు. దీంతో ధర్మాన, ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ఒకవైపు టీడీపీలో చేరికలు పెరుగుతుండగా.. మరోవైపు వైసీపీ తరఫున లక్ష్మీదేవి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు, సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూర్జ మండలాల్లోనూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మౌనం వహిస్తున్నారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సంబంధించిన పరిణామాలు కొంతకాలంగా వైసీపీకి రాజకీయ ఇబ్బందిగా మారాయి. ఈ పరిస్థితులన్నీ ఆ పార్టీ ప్రచారంపై ప్రభావం చూపుతున్నాయి.
వైసీపీలో నిరుత్సాహం..
అన్ని మండలాల్లో పార్టీని క్రియాశీలంగా నడిపించే నాయకత్వం వైసీపీలో కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార నిర్వహణ వరకు అన్నీ ముందుండి చూసుకునే నాయకులు కొరవడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండల స్థాయిలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. కూటమిపై విమర్శలకే పరిమితం కాకుండా ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తే కొంతైనా ప్రయోజనం ఉండేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి పార్టీల్లో కనిపిస్తున్న కదలికలు, వైసీపీలో నెలకొన్న నిశ్శబ్దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ అంతర్గత పరిస్థితులు, నాయకుల వ్యవహారశైలి, ప్రచార తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఫలితాల తర్వాతే తేలనుంది.