తీరంలో భయం
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:32 AM
Fishermen's protest విశాఖ తీరంలో వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో.. జిల్లాలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.
విశాఖ ఘటన నేపథ్యంలో మత్స్యకారుల ఆందోళన
11 తీర మండలాలకు మూడే మెరైన్ పోలీస్‌స్టేషన్లు
అరకొర సిబ్బందితో భద్రత ప్రశ్నార్థకం
ఇచ్ఛాపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): విశాఖ తీరంలో వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో.. జిల్లాలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇందులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన ఐదుగురితోపాటు.. విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా... మిగిలిన ఆరుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న సిక్కోలు తీరప్రాంతంలో రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.
జిల్లాలో ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం .. మొత్తం 11 తీరప్రాంత మండలాల్లో సుమారు 1.80 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వేటపై ఆధారపడి దాదాపు 35 వేల మంది జీవనం సాగిస్తున్నారు. 3,584 ఇంజన్ బోట్లు, 2,679 పడవలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక మెరైన్ పోలీసుస్టేషన్ ఉండాలి. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్నవి మూడే. కళింగపట్నం, భావనపాడు, బారువలో మాత్రమే మెరైన్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో కూడా అరకొర సిబ్బందే. మెరైన్ పోలీస్‌స్టేషన్లు పెంచుతామన్న ప్రభుత్వ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఒక్కో స్టేషన్ పరిధిలో మూడు నుంచి నాలుగు మండలాలు ఉండడం.. సిబ్బంది కొరత కారణంగా తీరప్రాంత రక్షణ కష్టమవుతోంది. తుఫాన్ల సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడం, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం ఇబ్బందికరంగా మారుతోంది.
సముద్ర తీరంలో 12 నాటికల్ మైళ్ల దూరం వరకూ నిరంతర భద్రతా చర్యలు పర్యవేక్షించాలి. విదేశీ మత్స్యకారులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలి. నేవీ విభాగానికి సమాచారం అందించాలి. కానీ సిబ్బంది లేకపోవడం ఒక ఎత్తయితే.. విధి నిర్వహణకు అవసరమైన మరబోట్లు, అత్యాధునిక పరికరాలు లేకుండాపోయాయి. దీంతో సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతం. గతంలో సమకూర్చిన మరబోట్లు, పరికరాలు తితలీ తుఫాన్ సమయంలో పాడయ్యాయి. కానీ వాటి స్థానంలో కొత్తవాటిని సమకూర్చలేదు.
పరిధి ఎక్కువ.. సిబ్బంది తక్కువ
బారువ మెరైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, మందస మండలాలు ఉన్నాయి. 36 తీరప్రాంత రెవెన్యూ గ్రామాలు, మరో ఐదు శివారు గ్రామాలున్నాయి. ఇక్కడ 42 మంది కానిస్టేబుళ్లకుగాను 9 మంది మాత్రమే ఉన్నారు. ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో శివారు మండలాల్లో విధుల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి మందస మండలం గంగువాడ వరకూ విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది.
భావనపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో 63 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయి. మరో ఏడు శివారు గ్రామాలున్నాయి. ఇక్కడ 82 మంది సిబ్బంది ఉండాలి. కానీ 29 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలు, అరకొర వసతులతో తీరప్రాంత రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
కళింగపట్నం పరిధిలో గార, శ్రీకాకుళం రూరల్, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 43 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 48 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.
ఇవి చేస్తే మంచిది..
మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు ఇవ్వాలి. వాటికి తేలియాడే గుణం ఉంటుంది. ఒకవేళ ప్రమాదానికి గురైనా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.
పడవ ప్రమాదాల నుంచి తప్పించుకునేలా మత్స్యకారులకు శిక్షణ ఇవ్వాలి.
తీరప్రాంతాల్లో మండలానికి ఒకటి చొప్పున మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేయాలి. సిబ్బందిని నియమించాలి. ప్రతి మత్స్యకార గ్రామానికి సిబ్బందిని దత్తతకు ఇవ్వాలి.
విపత్తులు, ప్రమాద హెచ్చరికలపై సరైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మత్స్యకారులకు సమాచారం ఇచ్చేందుకు వాకీటాకీలు అందించాలి. అనుసంధానంగా ఒక నెట్‌వర్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచిది.
భద్రత తీసుకుంటున్నాం
మెరైన్ పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వాస్తవమే. అయినా సరే ఉన్న సిబ్బందితో తీరప్రాంత భద్రత, రక్షణకు కృషిచేస్తున్నాం. ఎప్పటికప్పుడు మత్స్యకారులకు అప్రమత్తం చేస్తున్నాం. మత్స్యకారులు కూడా వేట సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎన్.శ్రీనివాస్, ఎస్‌ఐ, మెరైన్ పోలీస్‌స్టేషన్ బారువ
ముందస్తుగా అప్రమత్తం
తుఫాన్ హెచ్చరికలు వస్తే.. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు ముందస్తుగా సమాచారం ఇస్తాం. 36 మత్స్యకార గ్రామాలను 20మంది కానిస్టేబుల్స్ దత్తత తీసుకున్నారు. ప్రత్యేకంగా వీవీసీ(విలేజ్ విజిలెన్స్ కమిటీలు) ఏర్పాటు చేసి వీరికి సంబంధిత గ్రామాలను అప్పగించాం. వీరితోపాటు ఆరుగురు హోంగార్డులు కూడా తీరప్రాంత పరిరక్షణకు విధులు నిర్వర్తిస్తున్నారు.
- రమేష్, మెరైన్ సీఐ, బారువ