పేద కుటుంబంపై విధి కన్నెర్ర
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:12 AM
రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులకు ఆయనే దిక్కు. కూలి పనులు చేయగా... వచ్చిన పైసలే ఆధారం. అలాంటి పేద కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఎచ్చెర్ల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులకు ఆయనే దిక్కు. కూలి పనులు చేయగా... వచ్చిన పైసలే ఆధారం. అలాంటి పేద కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. విద్యుత్ తీగెల రూపంలో ఆ ఇంటి పెద్దను మృత్యువు కాటేసింది. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం... లావేరు మండలం తామాడ గ్రామానికి చెందిన సాడి ఈశ్వరరావు (48) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎచ్చెర్ల మండలం భగీరథపురం పంచాయతీ పరిధిలోని ఓలేటి అచ్చెన్న అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో బుధవారం పనికి వెళ్లాడు. చెట్లపై ఉన్న గెలలను గెడ కత్తితో కోస్తుండగా... ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. పని నుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న భార్య రత్నాలు, కుమార్తె దుర్గ, కుమారుడు రాజులు తమ ఇంటి యజమాని విగతజీవిగా మారాడన్న వార్త విని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి ఆధారమైన ఈశ్వరరావు ఆకస్మిక మృతితో ఆ ఇంట చీకట్లు అలముకున్నాయి. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.