Share News

ఘోర ప్రమాదం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:15 AM

ఆ చిన్నారి బాబాయ్‌తో ఎన్నో కబుర్లు చెబుతోంది. టూ వీలర్‌పై ముందు కూర్చుని దారి పొడవునా సందేహాలు అడుగుతోంది.

ఘోర ప్రమాదం
ప్రమాద దృశ్యం

-దైవ దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా..

-లారీని ఢీకొన్న టూ వీలర్‌

-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

-ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎడిషనల్‌ ఎస్పీ

ఆ చిన్నారి బాబాయ్‌తో ఎన్నో కబుర్లు చెబుతోంది. టూ వీలర్‌పై ముందు కూర్చుని దారి పొడవునా సందేహాలు అడుగుతోంది. వాటిని బాబాయ్‌ తీర్చుతూ ముందుకెళ్తున్నాడు. వెనుక కూర్చొన్న అమ్మమ్మ కూడా చిన్నారి మాటలు వింటూ ఆనందపడుతోంది. సింహాచలం నుంచి ఆ చిలుక పలుకులు ఆలకిస్తూనే అలసట మరిచి ప్రయాణం సాగిస్తున్నా రు. అలా వస్తుండగా భోగాపురం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన లారీని వీరు ఢీకొన్నారు. రెప్పపాటులో చిన్నారి మాట ఆగిపోయింది. సమాధానం చెబుతున్న బాబాయ్‌ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెనుక కూర్చొని వింటున్న అమ్మమ్మ అచేతనంగా మారిపోయింది. ఊహించని రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన సంచన సాయికుమార్‌(24), ఈయన అత్త గార మండలం దీపావళి గ్రామానికి చెందిన లావేటి చిన్నమ్మలు(45), ఈమె మనవరాలు సీహెచ్‌ రుత్విక(4) విషాదాంతమిది. జాతీయ రహదారిపై భోగాపురం సచివాలయం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

29Etcherla2.gifసాయికుమార్‌(ఫైల్‌), చిన్నమ్మలు (ఫైల్‌), రుత్విక (ఫైల్‌)

శ్రీకాకుళం/గార/ఎచ్చెర్ల/భోగాపురం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సింహాచలం నరసింహస్వామిని దర్శించుకుందామని అత్త కోరడంతో సరే అన్న అల్లుడు దైవ దర్శనానికి పయనమయ్యారు. అంతలో ‘అమ్మమ్మ, బాబాయ్‌ నేనూ వస్తాను’ అని చిన్నారి మారాం చేయడంతో బైక్‌మీద ముగ్గురూ శ్రీకాకుళం నుంచి బయలుదేరా రు. సింహాచలంలో స్వామిని దర్శించుకొ న్నారు. అనంతరం అదే ద్విచక్రవాహ నంపై స్వగ్రామం తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారిపై భోగాపురం సచివా లయం సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన లారీని ఢీకొన్నా రు. రెప్పపాటులో రోడ్డుపై పోడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యారు. సంఘటనను చూసిన స్థాని కులు చలించిపోయారు. తేరుకొని చూసే సరికి మూడు ప్రాణాలు గాల్లో కలిసిపో వడంతో అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టుకొన్నారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన సంచాన సాయికుమార్‌(24), అత్త గార మండలం దీపావళి గ్రామానికి చెందిన లావేటి చిన్నమ్మలు(45) ఈమె మనవరాలు సీహెచ్‌ రుత్విక(4) అక్కడిక క్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెం దిన సంచాన సాయికి గార మండలం దీపావళి గ్రామానికి చెందిన లావేటి చిన్నవాడు, చిన్నమ్మలు చిన్నకుమార్తె తేజ తో ఆరు నెలల కిందట వివాహం జరి గింది. తేజ ప్రస్తుతం గర్భిణి. సాయి కుటుంబంతో కలిసి విశాఖనగరంలోని మర్రిపాలెంలో నివాసముంటున్నాడు. డోర్‌ డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 28న వారాల పండుగ కోసం సాయికుమార్‌ స్వగ్రామం ఫరీదుపేటకు భార్య, తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. మంగళవారం వరసకు అన్న అయిన ఈశ్వరరావు ఇంట్లో వారాల పండుగలో పాల్గొన్నాడు. బుధవారం ఉదయానే సాయికుమార్‌ తల్లిదండుల్రు బస్సులో మర్రిపాలెం వెళ్లిపోయారు. భార్య తేజను అత్తవారి గ్రామమైన గార మండలం దీపావళికి తీసుకెళ్లాడు. సాయికుమార్‌ అత్త సింహాచలం స్వామిని దర్శించుకోవాలని ఉందని అనడంతో కాదనలేక అత్త లావేటి చిన్నమ్మడును తీసుకొని ద్విచక్రవాహనంపై బయలుదేరడానికి సిద్ధపడ్డారు. అంతలో చిన్నమ్మడు పెద్ద కుమారై కూతురు రుత్విక కూడా తానూ వస్తాను అని అల్లరి చేయడంతో ముగ్గురూ ద్విచక్రవాహనంపై బయలు దేరారు. సింహాచలంలో దైవ దర్శనం చేసుకొని అనంతరం ద్విచక్రవాహనంపై తిరిగి శ్రీకాకుళం వైపు జాతీయ రహదారిపై వస్తున్నారు. భోగాపురం సచివాలయం-2 సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన లారీని ఢీకొన్నారు. దీంతో ముందు కూర్చున్న బాలికతో సహా ముగ్గురూ కింద పడిపోయారు. ముగ్గురికీ తలకు బలమైన గాయాలు కావడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. సమీపంలో టీ షాపుల్లో ఉన్న పలువురు ఘటనను చూసి దిగ్ర్భాంతికి లోనయ్యారు. క్షణాల్లో తేరుకొని ఘటనా స్థలానికి చేరుకుని సపర్యలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ముగ్గురూ మృతిచెందారు. అచేతనంగా చిన్నారిని చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకొన్నారు. సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐలు వి.పాపారావు, పి.సూర్యకుమారి పోలీస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌) పి.సౌమ్యలత, ఇన్‌చార్జి డీఎస్పీ రాఘవులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారించారు. కుటుంభ సభ్యులు, స్థానికులతో మాట్లాడారు. మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటరావు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఫరీద్‌పేట, దీపావళిలో విషాదం

ఒకే కుటుంబానికి చెందిన సాయికుమార్‌, చిన్నమ్మలు, రుత్విక మృతితో ఫరీద్‌పేట, దీపావళి గ్రామాల్లో విషాదచాయలు అలముకున్నాయి. దీపావళిలో రజక వృత్తిచేసుకొని జీవనం సాగిస్తున్న లావేటి చిన్నవాడు, చిన్నమ్మలు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె గంగోత్రిని గ్రామంలోనే చిట్టివలస ఆదినారాయణ (పెయింటర్‌) ఇచ్చి వివాహం చేయగా, రెండో కుమార్తె తేజకు ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన సూర్యనారాయణ, సరస్వతి దంపతుల కుమారుడైన సాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద కుమార్తె గంగోత్రికి రుత్వికతో పాటు పూజిత్‌ (ఏడాది వయస్సు బాబు) ఉన్నాడు. సాయి తల్లిదండ్రులతో కలిసి రెండేళ్ల కిందట విశాఖపట్నానికి బతుకు తెరువు కోసం వెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్‌ చేసి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రహదారులపై ప్రయాణించే వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారిపై బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Updated Date - Apr 30 , 2026 | 12:15 AM