ఎరువుల కోసం రైతుల బారులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:05 AM
జిల్లాలో ఎరువుల కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు, పాలకులు చెబుతున్నారు.
- పెద్దపేట ఆర్‌ఎస్‌కే వద్ద ఉద్రిక్తత
బూర్జ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు, పాలకులు చెబుతున్నారు. అయితే, కొన్నిచోట్ల పంపిణీలో నిర్వహణ లోపం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బూర్జ మండలంలోని పెద్దపేట రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) వద్దకు శనివారం ఎరువుల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. యూరియా పంపిణీ చేస్తామని అధికారులు తెలియజేయడంతో పనుగుపర్తి, లక్కుపురం, పాలవలస, పెద్దపేట, మదనాపురం, గరిటపేట, బొమ్మిక, రామన్నపేట తదితర గ్రామాల రైతులు తెల్లవారుజాము నుంచే ఆర్‌ఎస్‌కే వద్ద బారులు తీరారు. రైతులంతా ఒకేసారి కేంద్రానికి చేరుకుని గుమిగూడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎస్‌ఐ ప్రవల్లిక రైతులకు ఆందోళన చెందవద్దని సూచిస్తూ వరుసలో నిలబడాలని కోరారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో టోకెన్లు అందించి ఎరువుల పంపిణీ సజావుగా నిర్వహించారు. ఎరువుల కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ పంపిణీ నిర్వహణలో లోపాలు కారణంగా గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.