రైతులకు సాగుపత్రాలు ఇవ్వాలి
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:35 PM
దేవదాయ భూముల సాగు రైతులకు పంట సాగు పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు నంబూరు షణ్ముఖరావు డిమాండ్ చేశారు.
టెక్కలి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): దేవదాయ భూముల సాగు రైతులకు పంట సాగు పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు నంబూరు షణ్ముఖరావు డిమాండ్ చేశారు. సోమవారం టెక్కలి రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఏవోకు రైతులు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా షణ్ముఖరావు మాట్లాడుతూ ఆలయ భూములు దున్నుతున్న కౌలురైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయానికి మదుపులు పెడుతున్నారని, ఈ ఏడాది ఎల్‌నినో నేపథ్యంలో మదుపులు పెట్టిన రైతులంతా నష్టపోయారన్నారు. కౌలు రద్దుచేసి మరో ఏడాది పంటకు అవకాశాలు కల్పించాలని కోరారు. సబ్‌లీజుదారులకు సైతం సాగురైతులుగా నమోదు చేయాలని, ఈక్రాప్ చేయాలని, సాగుదారులందరికీ పంట స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని, పంటల బీమా అమలు చేయాలని, ఆయా దేవాలయాలు వద్ద సాగురైతుల పేర్లు ప్రకటించాలని కోరారు. కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జన్ని కృష్ణారావు, కిల్లాన డేనియల్, ఆనందు, కిషోర్, శ్రీధర్, జ్ఞానానందం పాల్గొన్నారు.