Share News

రైతుకు ‘కాంప్లెక్స్‌’ కష్టాలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:09 AM

Hike in fertilizer prices ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఎరువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ప్రాథమికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. పంట ఎదుగుదలకు, దిగుబడికి అత్యంత కీలకమైన ‘కాంప్లెక్స్‌ ఎరువుల’ ధరలు భారీగా పెరిగాయి.

రైతుకు ‘కాంప్లెక్స్‌’ కష్టాలు

ఖరీఫ్‌లో ఎరువుల ధరల మంట!

రబీతో పోలిస్తే భారీగా పెంపు

ఒక్కో బస్తాపై రూ.250 నుంచి రూ.700 వరకు అదనపు భారం

ఆందోళనలో అన్నదాతలు

శ్రీకాకుళం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఎరువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ప్రాథమికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. పంట ఎదుగుదలకు, దిగుబడికి అత్యంత కీలకమైన ‘కాంప్లెక్స్‌ ఎరువుల’ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తమపై అదనపు భారం తప్పడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఎరువుల ధరను పరిశీలిస్తే.. యూరియా బస్తా - రూ.266.50, డీఏపీ - రూ.1350, డీఎస్‌పీ - రూ. 1300 ఉంది. ఇవి పాత రేట్లకే ఉంచినా.. మిగతా ఎరువుల ధరలు గణనీయంగా పెంచేశారు.

20.20.0.13 : గత రబీ సీజన్‌లో బస్తా రూ. 1,550 ఉండగా, ఇప్పుడు రూ.2,250కి చేరింది. బస్తాపై అత్యధికంగా రూ. 700 భారం పడింది.

14.35.14 : గతంలో రూ. 1900 ఉన్న ఈ బస్తా ధర ఇప్పుడు రూ. 2,350కి ఎగబాకింది.

15.15.15/16.16.16 : ఈ రెండు రకాల ఎరువుల బస్తాలపైనా సగటున రూ.375 చొప్పున ధర పెరిగింది.

16.20.0.13 : ఈ ఎరువు బస్తా రూ.1400 నుంచి రూ. 1750కి పెరిగింది.

10.26.26 : బస్తా ధర రూ.2000 నుంచి రూ. 2250 కి చేరింది.

వీటితో పాటు పల్లెల్లో ఎక్కువగా వాడే సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ ఎస్‌ఎస్‌పీ (పి) ధర కూడా రూ. 650 నుంచి రూ. 950కి చేరడం గమనార్హం.

ఆ పంటలకు ఇవే ప్రాణాధారం...

జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర వంటి పంటలు సాగవుతాయి. కేవలం యూరియా వేస్తే పైరుపచ్చగా ఏపుగా పెరుగుతుంది.. తప్ప, గింజ కట్టదు. పంటలో పూత దశ, గింజ పాలు పోసుకునే దశలో.. ముఖ్యంగా వరిలో దుబ్బు కట్టడానికి, వేరుశనగ, మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల్లో నాణ్యమైన దిగుబడి రావడానికి నత్రజని, భాస్వరం, పొటాష్‌ మిళితమై ఉండే 10.26.26, 14.35.14, 20.20.0.13 వంటి కాంప్లెక్స్‌ ఎరువులు వేయడం తప్పనిసరి. నేల స్వభావాన్ని బట్టి రైతులు ఈ ఎరువులను వాడుతుంటారు. ఇప్పుడు ఈ కీలకమైన ఎరువుల ధరలే పెరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

పెరుగుతున్న పెట్టుబడి.. తగ్గుతున్న గిట్టుబాటు

జిల్లాలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. ఇప్పటికే ట్రాక్టర్ల అద్దెలు, కూలీల రేట్లు, విత్తనాల ధరలు పెరిగిపోయి ఎకరాకు సాగు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎకరా వరి సాగుకు కనీసం నాలుగైదు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం అవుతాయి. తాజా ధరల ప్రకారం ఎకరాకు ఎరువుల రూపంలోనే రూ.1500 నుంచి రూ. 2000 వరకు అదనపు భారం పడనుంది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందన్న గ్యారెంటీ లేని ఈ రోజుల్లో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండటం రైతులు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను తగ్గించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:09 AM