రైతులూ జాగ్రత్త!
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:23 AM
Copper theft in transformers జిల్లాలోని పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో విలువైన రాగి(కాపర్), అల్యూమినియం చోరీకి గురవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానళ్లలో సైతం రాగిని దొంగల ముఠాలు దోచేస్తున్నాయి.
పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, సోలార్ ప్యానెల్స్ లక్ష్యం
వాటిలో విలువైన రాగి, అల్యూమినియం చోరీ
ఇటీవల పోలీసులకు పట్టుబడిన దొంగల ముఠా
ఈ నెల 1న కోటబొమ్మాళి పోలీసులకు ఆరుగురు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.8.15 లక్షల విలువచేసే ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి, అల్యూమినియం తీగలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాతోపాటు విజయనగరం జిల్లాలో కూడా ఏకంగా 25 ట్రాన్స్‌ఫార్మర్లను వీరు కొల్లగొట్టినట్టు తెలిసింది.
ఇటీవల జలుమూరు మండలం లింగాలవలస ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురైంది. అందులో 480 కిలోల వరకూ రాగి తీగలు దోచుకుపోయారు. దాని విలువ రూ.5.70 లక్షల వరకూ ఉంటుందని ఒక అంచనా. స్థానికుల ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండేళ్ల కిందట రణస్థలం మండలం రావాడ పంచాయతీ ఉప్పువలస పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి లోహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లను సమీప బావిలో పడేశారు. దీంతో పొలాలకు రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే కొన్నాళ్ల కిందట రణస్థలం మండలం గోశాంలో సైతం అర్ధరాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న విలువైన కాపర్‌ను దొంగిలించుకుపోయారు.
రణస్థలం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో విలువైన రాగి(కాపర్), అల్యూమినియం చోరీకి గురవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానళ్లలో సైతం రాగిని దొంగల ముఠాలు దోచేస్తున్నాయి. రైతులు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు. సాధారణంగా రబీలో పంట పొలాలకు సాగునీరందించేందుకు రైతులు మోటార్లు అమర్చుతుంటారు. ఇదే అదనుగా దొంగలు అర్ధరాత్రి పొలాల్లో చొరబడి వాటిని అపహరిస్తున్నారు. పాత ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న పొలాలను టార్గెట్ చేస్తున్నారు. పాత ట్రాన్స్‌ఫార్మర్లలో 10 నుంచి 14 కిలోల రాగి ఉంటుంది. మార్కెట్‌లో కిలో రాగి ధర రూ.2,500 పలుకుతోంది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌లలో రాగిని చోరీ చేసి.. బరంపూర్, కటక్, జైపూర్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రైతులు విద్యుత్ సమస్యలతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో సైతం రాగి, అల్యూమినియం ఉండడంతో వాటిని కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు. చోరీలో భాగంగా విద్యుత్ వైర్లను ప్రమాదకరంగా కట్‌చేసి విడిచిపెడుతున్నారు. ఇది తెలియని రైతులు పొరపాటున రాత్రి, వేకువజాము సమయంలో పొలాల్లోకి వెళితే ప్రమాదం తప్పదు. మరోవైపు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారుల చెంతనే పొలాల్లో విద్యుత్ మోటార్లు సైతం చోరీకి గురవుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
రైతులు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లపై దృష్టి పెట్టాలి. అనుమానాస్పదంగా ఎవరైనా పొలాల్లో తరసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- ఎం.అవతారం, జేఆర్‌పురం సీఐ