కుటుంబ సర్వే.. 59 శాతమే!
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:43 PM
Family survey is slowly అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఓ వైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఇంకోవైపు ప్రజల నుంచి ఆశించినస్థాయిలో స్పందనలేక సర్వే సక్రమంగా సాగడం లేదు.
జిల్లాలో నత్తనడకన సాగుతున్న ప్రక్రియ
సరైన సమాచారం ఇవ్వక ఇబ్బందులు
మొరాయిస్తున్న సర్వర్.. సిబ్బంది కొరత
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుల జారీకి ఆటంకం
నరసన్నపేట, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఓ వైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఇంకోవైపు ప్రజల నుంచి ఆశించినస్థాయిలో స్పందనలేక సర్వే సక్రమంగా సాగడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల ద్వారా ఈ సర్వే చేపట్టగా.. ఇష్టానుసారంగా వివరాలు నమోదు చేశారనే విమర్శలు ఉన్నాయి. కుటుంబ మ్యాప్ కూడా తప్పులతడకగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కుటుంబాలు లేకపోయినా ఉన్నట్లు మ్యాపింగ్ చేసేశారు. అప్పట్లో తప్పుల సవరణకు అవకాశం ఇవ్వలేదు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రస్తుత కూటమి పాలనలో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, ఆటోడ్రైవర్ల సేవలో తదితర సంక్షేమ పథకాలకు చాలామంది దూరమయ్యారు. దీంతో సచివాలయ సిబ్బందితో సమగ్ర సర్వే ద్వారా వీటన్నింటినీ సరిచేసి.. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి.. గతేడాది డిసెంబరులో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రారంభించారు. జనవరి పదో తేదీలోగా సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఏ పథకం వర్తింపజేయాలన్నా లబ్ధిదారుల వివరాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా సర్వే సకాలంలో పూర్తికాకపోవడంతో గడువు ఈ నెల పదో తేదీ వరకూ పొడిగించారు. అయినప్పటికీ జిల్లాలో సోమవారం నాటికి 59.27 శాతం మాత్రమే సర్వే పూర్తయింది.
ప్రక్రియ ఇలా..
జిల్లాలో 7,36,450 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 4,36,521 కుటుంబాల సర్వే (59.27) పూర్తయింది. జిల్లాలో అత్యధికంగా బూర్జ మండలంలో 14,206 కుటుంబాలకుగాను 11,669 కుటుంబాల సర్వే పూర్తిచేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 42,181 కుటుంబాలు ఉండగా, అందులో 21,065 కుటుంబాల సర్వే మాత్రమే (49.96శాతం) చేశారు. శ్రీకాకుళం రూరల్‌లో 33,863 కుటుంబాలు ఉన్నాయి. 17,977 కుటుంబాల సర్వే (53.01శాతం) చేశారు. శ్రీకాకుళం అర్బన్‌లో 50.06 శాతం కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఆమదావలసలో 29.54 శాతం, పలాస- కాశీబుగ్గలో 41.31 శాతం, ఇచ్ఛాపురంలో 45 శాతం కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది.
ఇబ్బందులివీ..
జిల్లాలో 732 సచివాలయాల్లో 6,353 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొందరు సర్వే చేయకుండా తప్పించుకున్నట్లు సమాచారం. సుమారు 200 మందికి పైగా ఉన్నత ఉద్యోగ పరీక్షలంటూ సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉన్న సిబ్బంది పని భారం పెరిగింది. అలాగే కుటుంబ సర్వే యాప్‌కు సంబంధించి డివైజ్ సరిగా పనిచేయక.. మరోవైపు నెట్‌వర్క్ సమస్యలతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు సర్వే.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలుతో అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. సర్వేలో ఒక్కో కుటుంబం వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లి 60 ప్రశ్నలు అడగ్గా.. ప్రజలు అరకొరగానే సమాధానం ఇస్తున్నారు. బైక్, కారు, భూములు, సొంత ఇళ్లు.. తదితరాలు ఉన్నాయా? అని అడగ్గా.. ప్రభుత్వ పథకాలకు దూరమవుతామనే ఉద్దేశంతో చాలామంది తప్పుగా లేవనే చెబుతున్నారు. దీంతో సర్వే సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.