Share News

చనిపోయిన వారి పేరుతో నకిలీ పత్రాలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:13 AM

చనిపో యినవారిపై నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూమిని కాజేయాలనుకున్న కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సీఐ పైడిపునాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చనిపోయిన వారి పేరుతో నకిలీ పత్రాలు

  • భూ ఆక్రమణకు కుట్ర

  • ఎనిమిది మంది అరెస్టు

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): చనిపో యినవారిపై నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూమిని కాజేయాలనుకున్న కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సీఐ పైడిపునాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. రాగోలు గ్రామానికి చెందిన ధర్మాన పద్మావతికి అదే గ్రామ పరిధిలో సుమారు 0.96 ఎకరాల భూమి ఉంది. దీనిని కాజేసేందుకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలుగు సతీష్‌కుమార్‌, ఆయన అనుచరులు గేదెల షన్ముఖరావు (ఇటీవల మరణించాడు), మా మిడి జగన్నాథం తదితరులు ప్రణాళిక రూపొందిం చారు. ఇందులో భాగంగా గేదెల షన్ముఖరావు.. మరణించిన తన తల్లి గేదెల భానుమతి పేరుతో నకిలీ భూ రికార్డులు సృష్టించాడు. ఇందుకు అ య్యే ఖర్చు సుమారు రూ.15 లక్షలు అర్జి అప్పల రాజు, కరకవలస వడ్డిబాబు, శ్రీరామసూర్య సమ కూర్చారు. భూమి అమ్మిన తర్వాత రెట్టింపు డబ్బు లు ఇచ్చేందుకు వారితో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బొచ్చా గోవిందరాజులు, దాట్ల గోపాలకృష్ణరాజు, కొదురు విజయ్‌కుమార్‌ సాయంతో నకిలీ పత్రాలు సృష్టిం చుకున్నారు. అనంతరం సేల్‌ ఎగ్రిమెంట్‌ చేయిం చుకున్న తెలుగు సతీష్‌కుమార్‌ ఇతరుల పేర్లకు మార్చేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. ఈ క్ర మంలో ఈ నెల 6న నిందితులు స్థలానికి వెళ్లి కొలతలు వేస్తుండగా గ్రామానికి చెందిన కొంత మంది వారిని ప్రశ్నించడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ ఘటనపై ధర్మాన పద్మావతి భర్త చిన్నవాడు శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ నెల 8న తెలుగు సతీష్‌కుమార్‌, మామిడి జగన్నాథం, బొచ్చా గోవిందరాజులు, కొదురు విజయ్‌కుమార్‌, దాట్ల గోపాలకృష్ణరాజు, అర్జి అప్పలరాజు, శ్రీరామసూర్య, కరకవలస వడ్డిబాబులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. నిందితుల నుంచి నకిలీ భూ రికార్డులు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - Apr 10 , 2026 | 12:13 AM