Share News

మత్స్యకారుల శ్రమదోపిడీ!

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:58 PM

No Fishing harbors, cold storages జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్లు, కోల్డ్‌స్టోరేజ్‌లు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. తీరంలో ఆటుపోట్ల నడుమ వేట సాగించినా.. మత్స్యసంపదను భద్రపరుచుకోలేక పోతున్నారు.

మత్స్యకారుల శ్రమదోపిడీ!
డొంకూరులో సముద్ర తీరాన చేపలు నిల్వ చేస్తున్న మత్స్యకారులు

  • వేటాడిన చేపలు నిల్వ చేసుకోలేక ఇబ్బందులు

  • దళారులకు తక్కువ ధరలకు విక్రయాలు

  • అందుబాటులోకి రాని ఫిషింగ్‌ హార్బర్లు, కోల్డ్‌ స్టోరేజీలు

  • ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలో దాదాపు 90శాతం మంది మత్స్యకారులే. కానీ వారు వేటాడి తెచ్చిన చేపలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌స్టోరేజీలు లేవు. ఆరబెట్టేందుకు వీలుగా ప్లాట్‌ఫాంలు లేవు. దీంతో చేపలు నిల్వ ఉంచుకోలేక దళారులు అడిగిన ధరకే విక్రయించాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్లు, కోల్డ్‌స్టోరేజ్‌లు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. తీరంలో ఆటుపోట్ల నడుమ వేట సాగించినా.. మత్స్యసంపదను భద్రపరుచుకోలేక పోతున్నారు. మంచి ధర వచ్చేదాక చూసే పరిస్థితి లేక మధ్యవర్తులు, దళారులకు తక్కువ ధరకు చేపలను విక్రయిస్తున్నారు. తమ కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • జిల్లాలోని 11 తీర మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలున్నాయి. 1.80 లక్షల మత్స్యకార జనాభా ఉండగా.. వేటపై ఆధారపడి 35వేల మంది బతుకుతున్నారు. 3,584 ఇంజను బోట్లు, 2,679 తెప్పలు, పడవలపై చేపల వేట సాగిస్తున్నారు. ప్రధానంగా ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో మత్స్యకారులు వేటపై ఆధారపడుతున్నారు. అయితే ఒక్కో మెకనైజ్డ్‌ బోటులో వేటకు వెళ్తే.. 3 నుంచి 10 టన్నుల వరకూ చేపలు తీసుకొస్తారు. వీటిని తీరంలో నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌స్టోరేజీలు లేవు. ఎండబెట్టేందుకు ప్లాట్‌ఫారంలు సైతం లేవు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దళారులకు విక్రయిస్తుంటారు. మార్కెట్‌లో తాజా చేపల ధర కిలో రూ.150 పైమాటే. కానీ దళారులు మాత్రం కిలో రూ.80 నుంచి రూ.100 లోపు కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో దళారులు అడిగినంత ధరకు మత్స్యకారులు విక్రయిస్తున్నారు.

  • ఆ పనిచేస్తేనే..

  • తీరంలో ఫిషింగ్‌ హార్బర్లు, జెట్టీలు నిర్మిస్తే వ్యాపారులు అనుబంధంగా కోల్డ్‌స్టోరేజీలు కట్టేందుకు ముందుకు వస్తారు. ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ఇంతవరకూ కొలిక్కి రాలేదు. కనీసం అక్కడ కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించినా మత్స్యసంపదను నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మంచి ధర పలికినప్పుడు విక్రయించుకోవచ్చు. నాబార్డు సాయంతో రెండుచోట్ల కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం సైతం రెండు ఫిషింగ్‌ హార్బర్లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. అవి వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చితే మత్స్యకారులకు ఇబ్బందులు తీరనున్నాయి. ఈ విషయంలో మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ చూపాలని మత్స్యకారులు కోరుతున్నారు.

  • ప్రభుత్వం దృష్టి పెట్టాలి

  • మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మత్స్య సంపదను నిల్వ చేసేందుకు కోల్డ్‌స్టోరేజీలను నిర్మించాలి. ఫిషింగ్‌ హార్బర్లను అందుబాటులోకి తేవాలి.

    - చలపరాయి గురుమూర్తి, మత్స్యకారుడు, డొంకూరు

  • దురదృష్టకరం

  • జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం విషయంలో ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం దురదృష్టకరం. 11 మండలాల్లో మూడు మండలాలకు ఒకటి చొప్పున ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి అందుబాటులోకి తేవాలి. హామీలు అమలుచేసి మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చాలి.

    - బి.రామారావు, మత్స్యకారుడు, డొంకూరు

Updated Date - Feb 04 , 2026 | 11:58 PM