ఉత్సాహంగా మేడే
ABN , Publish Date - May 02 , 2026 | 12:13 AM
Construction workers' bike rally ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తదితర చోట్ల కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జెండా ఆవిష్కరణలు చేశారు.
భవన నిర్మాణ కార్మికుల బైక్ ర్యాలీ
అమరవీరుల స్ఫూర్తితో లేబర్‌కోడ్లను తిప్పికొడదాం
సీఐటీయూ, సీపీఎం నేతల పిలుపు
అరసవల్లి, మే 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తదితర చోట్ల కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జెండా ఆవిష్కరణలు చేశారు. శ్రీకాకుళం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. డైమండ్ పార్కు నుంచి ఏడురోడ్ల కూడలి వరకు కార్మికులు ర్యాలీ చేశారు. ‘మేడే వర్థిల్లాలి, కార్మికుల ఐక్యత వర్థిల్లాలి, లేబర్ కోడ్లను తిప్పికొడదాం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సీపీఎం కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ ఎందరో త్యాగాలను గుర్తు చేసుకుంటూ, అమరవీరుల సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాపాడుదామన్నారు. ఐదేళ్లకోసారి చేపట్టాల్సిన వేతన సవరణలు 15 ఏళ్లు గడుస్తున్నా.. జరగడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.25వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.మురళీ, ఎం.ఆదినారాణమూర్తి, ఎం.గోవర్దనరావు, మున్సిపల్, రిమ్స్, కళాసీ, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మున్సిపల్ యూనియన్ నాయకులు బలరాం, గణేష్, చిన్నారావు, అప్పలరాజు, సూర్యనారాయణ, పోస్టల్, భవన నిర్మాణ, జనవిజ్ఞాన వేదిక, యుటిఎఫ్‌లతో పాటు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.