Share News

విద్యా, ప్రజా సమస్యల పరిష్కారంలో భేష్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:48 AM

Statistics revealed at CM-Collectors conference అమరావతి వేదికగా శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీలతో కలసి శాంతిభద్రతలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర నివేదికలో జిల్లా సాధించిన ప్రగతి, ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన గణాంకాలు వెల్లడయ్యాయి.

విద్యా, ప్రజా సమస్యల పరిష్కారంలో భేష్‌
సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు.. హాజరైన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • ప్రభుత్వ పాఠశాలల హాజరులో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌

  • మధ్యాహ్న భోజన పథకంపై 77.5శాతం సంతృప్తితో రెండో స్థానం

  • ఇంటర్‌ అడ్మిషన్ల పెంపులోనూ అదుర్స్‌.. పీజీఆర్‌ఎస్‌లో టాప్‌-3

  • మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణంలో తీవ్ర వెనుకబాటు

  • గ్రామీణ ద్వాక్రా రుణాల మంజూరులో 25వ స్థానానికి పడిపోయిన వైనం

  • సీఎం- కలెక్టర్ల సదస్సులో కీలక గణాంకాలు వెల్లడి

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమరావతి వేదికగా శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీలతో కలసి శాంతిభద్రతలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర నివేదికలో జిల్లా సాధించిన ప్రగతి, ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన గణాంకాలు వెల్లడయ్యాయి. విద్య, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచి ‘భేష్‌’ అనిపించుకున్న సిక్కోలు యంత్రాంగం.. పచ్చదనం పెంపు, జల సంరక్షణ, మహిళా రుణాల పంపిణీలో మాత్రం చతికిలపడింది.

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సగటు హాజరు శాతంలో జిల్లా అద్భుత ప్రదర్శన కనబరిచింది. 99.77 శాతం హాజరుతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026-27)అడ్మిషన్లు గతేడాది కంటే 1,055 మేర పెరిగాయి. అడ్మిషన్ల పెంపులో కర్నూలు తర్వాత జిల్లాది రెండో స్థానం.

  • మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, నాణ్యతపై ప్రజల నుంచి అత్యధికంగా 77.5శాతం పాజిటివ్‌ రేటింగ్‌ వచ్చి, రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఫౌండేషనల్‌ లిటరసీ పరీక్షల్లో 99.84 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టమ్‌ ద్వారా కమ్యూనిటీ ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా సత్తా చాటింది. గత మూడు నెలల్లో 5,339 ఫిర్యాదులు రాగా.. వాటి పరిష్కారంపై 96 శాతం మంది ప్రజలు సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ విభాగంలో జిల్లా 3వ స్థానం దక్కించుకుంది. వ్యక్తిగత ఫిర్యాదుల పరిష్కారంలోనూ 94 శాతం పాజిటివ్‌ స్పందనతో 5వ స్థానంలో నిలిచింది.

  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నైపుణ్యం’ పోర్టల్‌ రిజిస్ట్రేషన్లలో 42.12 శాతం లక్ష్యాన్ని (11,446 రిజిస్ట్రేషన్లు) చేరుకుని రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. పీ-4 ఇనిషియేటివ్‌ కింద బంగారు కుటుంబాలకు మార్గదర్శులను అనుసంధానం చేయడంలో 76.24 శాతం సాధించి మెరుగైన స్థితిలో ఉంది.

  • ఇక్కడే వెనుకబాటు

  • నెట్‌ జీరో క్యాంపస్‌లో భాగంగా ‘అనంత అరణ్య’ ప్లాంటేషన్‌ కింద జిల్లాకు 1,09,105 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా.. కేవలం 6,525 మొక్కలు (6.0 శాతం) మాత్రమే నాటి తీవ్రంగా వెనుకబడింది.

  • వర్షపు నీటి సంరక్షణ కోసం 160 ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా కేవలం 7 మాత్రమే పూర్తయ్యాయి. కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ 57 నిర్మించాల్సి ఉండగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు.

  • గ్రామీణ ప్రాంత డ్వాక్రా మహిళలకు బ్యాంక్‌ లింకేజీ లక్ష్య సాధనలో సిక్కోలు బాగా వెనుకబడింది. కేవలం 63.95 శాతం సాధించి మొత్తం 28 జిల్లాలకు గానూ 25వ స్థానానికి పడిపోయింది. మహిళా పారిశ్రామికవేత్తల గుర్తింపు లక్ష్యంలోనూ 39.59 శాతంతో వెనుకబడి ఉంది.

  • విద్యాశాఖ ప్రవేశపెట్టిన ‘లీప్‌ పేరెంట్‌ యాప్‌’ డౌన్‌లోడ్స్‌, వినియోగంలో జిల్లా కేవలం 11.10 శాతంతో అట్టడుగు జాబితాలో (చివరి నుంచి 4వ స్థానం)నిలిచింది.

  • ప్రభుత్వ పథకాలు, సేవలపై ఐ అండ్‌ పీఆర్‌ శాఖ నిర్వహించిన ‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌’ ర్యాంకింగ్స్‌లో జిల్లా స్కోరు గత సదస్సులో 74.7 ఉండగా, ప్రస్తుతం అది 72.3 శాతానికి పడిపోయి 12వ స్థానానికి పరిమితమైంది. జిల్లా యంత్రాంగం ఏయే అంశాల్లో ముందుందో వాటిని మరింత పటిష్టం చేసుకుంటూనే.. వెనుకబడిన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.

  • నేరాల కట్టడిలో ముందంజ

  • శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలను నియంత్రించడంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరుతో ప్రథమ స్థానంలో నిలిచారు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన కీలక సదస్సులో ప్రదర్శించిన నివేదికల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. 2024-25, 2025-26 (ఆగస్టు-జూలై) సంవత్సరాల మధ్య నమోదైన కేసుల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో జిల్లాకు సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. సాధారణ నేరాలు భారీగా తగ్గుముఖం పట్టినా.. టెక్నాలజీ ఆధారిత నేరాలు, ఇతర కేసులు స్వల్పంగా పెరగడం గమనార్హం.

  • రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో నేరాలు 28.8 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. 2024-25 (ఆగస్టు-జూలై)లో 4,493 కేసుల నమోదు కాగా, 2025-26(ఆగస్టు-జూలై) నాటికి అవి 3,200కు తగ్గాయి. నేరాల కట్టడిలో ఈ స్థాయిలో వృద్ధి సాధించి శ్రీకాకుళం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

  • సైబర్‌ నేరాల విషయంలో మాత్రం పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. 1930 పోర్టల్‌కు అందిన ఫిర్యాదుల ప్రకారం.. జిల్లాలో సైబర్‌ నేరాలు 12.36 శాతం పెరిగాయి. గతేడాది 2,081 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 2,343కు చేరింది. రాష్ట్రంలో సైబర్‌ నేరాలు 12.6 శాతం కంటే ఎక్కువగా నమోదైన ఐదు జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం.

  • ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల నమోదులో ఎటువంటి మార్పు లేదు. గతేడాది, ఈ ఏడాది కూడా కచ్చితంగా 55 కేసులే నమోదు కావడం గమనార్హం.

  • స్వల్పంగా పెరిగిన ఇతర నేరాలు...

  • జిల్లాలో ఆర్థిక నేరాలు 1.5 శాతం మేర స్వల్పంగా పెరిగాయి. గతేడాది 135 కేసులు ఉండగా, ఈ ఏడాది అవి 137కు చేరాయి. గంజాయి తదితర మత్తుపదార్థాల కేసులు 1.8 శాతం పెరిగాయి. గతంలో 114 కేసులు నమోదు కాగా ఈ సారి అవి 116కు పెరిగాయి. లా అండ్‌ ఆర్డర్‌ కిందకు రాని శారీరక దాడుల కేసులు గతేడాది 748 నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 752కి చేరింది. అల్లర్లకు సంబంధించి గతేడాది కేవలం ఒక కేసు మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య మూడుకు పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్‌ మోసాలు, గంజాయి లాంటి మత్తుపదార్థాల రవాణాపై ఇకపై పోలీసులు మరింత ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సమావేశంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:48 AM