నగరంలో ఈవ్‌టీజింగ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:56 PM
Eve teasing for female students శ్రీకాకుళం నగరంలో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్థినులను.. ఒంటరిగా వెళ్తున్నవారిని టార్గెట్ చేస్తూ వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. ఇంటర్, డిగ్రీ మహిళా కళాశాలల వద్ద కూడా విద్యార్థినులను ఈవ్‌టీజింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు.
ఒంటరిగా వెళుతున్న విద్యార్థినులే టార్గెట్
ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న బాధితులు
శక్తి టీమ్‌లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి
అవగాహన కల్పించడంతో పోలీసుశాఖ వైఫల్యం
శ్రీకాకుళం నగరంలోని బైరివానిపేట ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని టెక్కలిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. ప్రతిరోజూ కళాశాలకు బస్సులో వెళ్లివస్తోంది. ఇటీవల బుధవారం బైరివానిపేట జంక్షన్‌లో బస్సు దిగి నడిచివెళ్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన రాగోలు గుణశేఖర్ అనే యువకుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెపై దాడి చేశాడు. ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో వారు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
రాగోలుకు చెందిన ఓ యువతి శ్రీకాకుళం న్యూకాలనీలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల కిందట ఆ యువతి రామలక్ష్మణ జంక్షన్ వద్ద బస్సు దిగి కళాశాలకు వచ్చే వరకు ఓ ఆకతాయి వెంటపడి చేతులను పట్టుకొని వేధించాడు. ఈ విషయం కళాశాల సిబ్బందికి ఆ యువతి చెప్పడంతో.. వారు ఆకతాయిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్థినులను.. ఒంటరిగా వెళ్తున్నవారిని టార్గెట్ చేస్తూ వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. ఇంటర్, డిగ్రీ మహిళా కళాశాలల వద్ద కూడా విద్యార్థినులను ఈవ్‌టీజింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం కొంతమంది విద్యార్థినులు తల్లిదండ్రులు, కళాశాల సిబ్బందికి చెప్పుకోలేక మథనపడుతున్నారు. ఆకతాయిల ఆటలు కట్టించేందుకు శక్తిటీమ్‌లు ఉన్నాయని గతంలో అధికారులు ప్రకటించినా, ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో పోలీసులు ఆకతాయిలను స్టేషన్‌కు తీసుకెళ్లి, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పోలీసు అధికారులు కూడా శక్తి టీమ్స్‌పై చిత్తశుద్ధితో అవగాహన కల్పించడంలో విఫలం అయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
ఒకటే అలజడి..
శ్రీకాకుళం నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో కొంతమంది బైక్‌లకు నెంబర్‌ప్లేట్లు లేకుండానే విచ్చలవిడిగా చక్కెర్లు కొడుతూ.. సైలెన్సర్లతో విపరీతమైన శబ్దాలు చేస్తున్నారు. కళాశాలల వద్ద, రోడ్డున పోయేవారితోను అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యువకులు రాత్రివేళల్లో గంజాయి, మద్యం మత్తులో.. మహిళలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సెంటర్లలో తాగుబోతులు ఒంటరిగా వెళ్లేవారిని ఆపి తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. లేదంటే దాడులకు దిగుతున్నారు. దీంతో మహిళలు, యువతులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. గతంలో బ్లూకోల్డ్స్ వాహనాలు, రక్షక్ పోలీసు వాహనాలు ఉండేవి. ఈ వాహనాలతో పోలీసులు క్షణాల్లో ఘటనా స్థలికి చేరుకొని ఆకతాయిల ఆట కట్టించేవారు. కొన్ని కళాశాలల వద్ద మప్టీలో ఉండి ఆకస్మికంగా ఆకతాయిలను పట్టుకొని వారిపై చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం వివిధ బందోబస్తుల విధుల్లో పోలీసులు ఉండడంతో కళాశాలలు, ప్రధాన పట్టణాల్లో నిఘా కొరవడుతోంది. ఇదే ఆసరాగా చేసుకుని ఆకతాయిలు అలజడి సృష్టిస్తున్నారు. గంజాయి, మద్యానికి బానిసై నగరంలో విచ్చలవిడిగా తిరుగుతూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఆకతాయిల బెడద తగ్గించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
దృష్టి సారించాం
శ్రీకాకుళం నగరంలో ఆకతాయిలపై దృష్టి పెట్టాం. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులను ఆశ్రయించండి. ధైర్యంగా 112, 100 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయండి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. ఏదైనా నేరం జరిగితే తర్వాత ఏమీ చేయలేం. అందుకే ముందుగానే అప్రమత్తత అవసరం.
- వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం